
రెజ్లర్ నీలేశ్ కందుర్కర్ (ఫైల్ ఫొటో)
ముంబై: రెజ్లింగ్ క్రీడలో విషాదం చోటుచేసుకుంది. బౌట్‌లో ప్రత్యర్థితో పోరాటంలో మెడ విరిగిన రెజ్లర్ నీలేశ్ కందుర్కర్ (20) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో చోటుచేసుకుంది. జ్యోతిబా జాతర సందర్భంగా గత సోమవారం కోల్హాపూర్‌లోని బండివేడ్‌లో కుస్తీ పోటీలు నిర్వహించారు. పాల్గొన్న తొలి బౌట్‌లోనే నీలేశ్‌కు బలమైన ప్రత్యర్థి ఎదురుపడ్డాడు. ఎక్కువగా ఆత్మరక్షధోరణిలో ఆడుతున్న నీలేశ్ ప్రత్యర్థికి పాయింట్లకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో అసహనానికి లోనైన మరో రెజ్లర్ నీలేశ్‌ను గాల్లోకి అమాంతం ఎత్తగా.. పట్టు విడిపించుకునే యత్నంలో కిందపడ్డాడు.
ప్రత్యర్థి రెజ్లర్ సంబరాలు చేసుకుంటుండగా.. మెడపైనే పూర్తి బరువు పడుతూ పడిపోవడంతో నిలేశ్ స్పృహ కోల్పోయినట్లు గుర్తించిన అధికారులు కోల్హాపూర్‌లోని మెట్రో హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషయంగా ఉందని కరాడ్‌లోని క్రిష్ణ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. గత నాలుగు రోజులుగా వైద్యులు చేసిన యత్నాలు విఫలం కావడంతో రెజ్లర్ నీలేశ్ మృతిచెందాడు.
ఆటలో అనుకోకుండా జరిగిన ఘటన కనుక ప్రత్యర్థి రెజ్లర్ పేరు వెల్లడించకూడదని నిర్ణయించుకున్నట్లు అధికారులు చెప్పారు. నీలేశ్ మృతికి కారణమైన రెజ్లర్ ఇంకా షాక్‌లోనే ఉన్నాడని, ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని సూచించారు. మరోవైపు రెజ్లర్ నీలేశ్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment