
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఓ వైపు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తన సీట్ల షేరింగ్ ఫార్ములాను ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మరోవైపు కాంగ్రెస్ మాత్రం రాజకుటుంబీకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు ఛత్రపతి షాహూ మహారాజ్‌ను కొల్హాపూర్ నుంచి అభ్యర్థిగా ప్రకటించింది.
కొల్హాపూర్ మాజీ రాజకుటుంబానికి అధిపతిగా ఛత్రపతి షాహూ మహారాజ్‌కు రాష్ట్రవ్యాప్తంగా అపారమైన గౌరవం ఉంది. రాజకీయంగా కాంగ్రెస్‌తో జతకట్టినప్పటికీ, 1998లో లోక్‌సభ ఎన్నికల్లో వైఫల్యం తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. కొల్హాపూర్ రాజర్షి ఛత్రపతి షాహు మనవడైన ఆయనకు మరాఠా ప్రజల్లో ఉన్న గుర్తింపు, స్థాయి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తుంది.
బీజేపీ మాజీ ఎంపి ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు తండ్రి ఛత్రపతి షాహూ మహారాజ్ మరాఠా సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి కూడా. 2023 జూన్‌లో జరిగిన మతపరమైన అల్లర్ల తరువాత, షాహూ ఛత్రపతి కొల్హాపూర్‌లో 'సద్భావన' ర్యాలీకి నాయకత్వం వహించారు.
కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఛత్రపతి షాహూ మహారాజ్ నిర్ణయించుకున్నారని ఆయన కుమారుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ తెలిపారు. తన తండ్రి ఇప్పటికే రేసులో ఉన్నందున తాను పోటీ నుంచి తప్పుకొన్నట్లు స్పష్టం చేసిన ఆయన.. తన తండ్రి విజయానికి సహకరించాలని కార్యకర్తలను కోరారు.