క్రికెట్‌లో విజయానికి చిరునామాగా నిలిచిన మహేంద్రసింగ్ ధోనీ నుంచి విరాట్ కోహ్లి పూర్తిస్థాయిలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టింది ఈ ఏడాదే. గత ఏడాది వరకు టెస్టుల్లో మాత్రమే కెప్టెన్‌గా కొనసాగిన కోహ్లి.. ఈ ఏడాది ధోనీ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో వన్డేలు, టీ-20ల నాయకత్వ పగ్గాలు కూడా అందుకున్నాడు. దీంతో మూడు ఫార్మెట్లలోనూ సారథిగా జట్టుపై పూర్తి పట్టు సాధించాడు. ఇక, ఈ ఏడాది అభిమానులు ఎక్కువగా కోహ్లి జపమే చేశారు. ఏడాది మొదట్లో కెప్టెన్సీ తీసుకోవడం మొదలు, చివర్లో పెళ్లి వరకూ అభిమానుల ఊహకందనిరితీలో కోహ్లి అలరిస్తూ వచ్చాడు. ఒక్క చాంపియన్ ట్రోఫీ మినహా అన్ని సిరీస్‌ల్లో విజయం సాధించి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న కొత్త పెళ్లికొడుకు కోహ్లికి వచ్చే ఏడాది ఎన్నో సవాళ్లు ముందున్నాయి. టీమిండియా విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ ఏడాది జరిగిన ది బెస్ట్ ఘటనలపై ఓ లుక్ వేద్దాం..(సాక్షి ప్రత్యేకం)
టీమిండియా నయా కెప్టెన్..
ఈ ఏడాది మొదట్లో వన్డే, టీ20ల కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లి.. అటు బ్యాటింగ్‌తోనూ, ఇటు జట్టు విజయాలతోనూ అభిమానులను అలరించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌కు విశ్వరూపం చూపించాడు. 350పరుగుల లక్ష్యాన్ని కేదార్ జాదవ్ (76బంతుల్లో120) సహకారంతో కోహ్లి (104 బంతుల్లో122) అలవోకగా ఛేదించాడు.(సాక్షి ప్రత్యేకం) అలాంటి ఇన్నింగ్స్‌లు చెప్పలేనన్ని ఉన్నాయి. కెప్టెన్‌గా ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై వరుస సిరీస్ విజయాలు అందుకున్నాడు. ఈ విజయ పరంపరతో ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో నంబర్ వన్ స్థానం టీమిండియా వాకిట నిలిచింది. ఈ ఏడాది కోహ్లి టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించడం గమనార్హం.
టీమిండియా ఫిట్‌నెస్ జపం..
‘‘యథా రాజా తథా ప్రజా’’ అన్నట్టు ఫిట్‌నెస్ విషయంలో కెప్టెన్ కోహ్లిని మిగతా ఆటగాళ్లు అనుసరిస్తున్నారు. ఇప్పుడు అందరు అటగాళ్లు దేహదారుఢ్యంపై దృష్టిపెట్టి ఆటలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రతి ఆటగాడు కోహ్లియే మాకు ఫిట్‌నెస్ గురువు అంటున్నాడు.
కుంబ్లేతో వివాదం-కొత్త కోచ్ నియామకం
కోచ్‌గా కుంబ్లే నియాయకం తర్వాత జట్టులో కొత్త ఉత్సాహంతోపాటు క్రమశిక్షణ ఎక్కువైంది. ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో కుంబ్లే కాస్త కటువుగా వ్యవహరించడంతో ఆయన మాకోద్దు బాబోయ్ అంటూ కోహ్లి అండ్ కో బీసీసీఐతో మొరపెట్టుకుంది. దీంతో కుంబ్లే బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రిని త్రిమూర్తులు (సచిన్,గంగూలి,లక్ష్మణ్) నియమించారు. గెలిస్తే పార్టీ లేకుంటే మరింత ప్రాక్టీస్ అన్న రవిశాస్త్రి ఫార్ములా ఆటగాళ్లందరికీ నచ్చడంతో వారు ఈ కోచ్‌కు బాగా కనెక్ట్ అయ్యారు.
కొత్త ఆటగాళ్లకు అవకాశాలు
కోహ్లి కెప్టెన్సీలో కొత్త వారికి పుష్కలంగా అవకాశాలు లభిస్తున్నాయి. కేఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా, మనీష్ పాండే, కేదార్ జాదవ్, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్ లాంటి వారికి వరుస అవకాశాలు లభిస్తుండగా.. సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ వంటి కొత్త ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు.(సాక్షి ప్రత్యేకం) స్పిన్ ద్వయం అనగానే ఒకప్పుడు కుంబ్లే-హర్భజన్, అశ్విన్-జడేజాలు గుర్తుకువచ్చేవాళ్లు.. ఇప్పుడు కుల్‌దీప్ యాదవ్- యజువేంద్ర చాహల్ జోడీ కూడా తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది.
ఆటగాళ్ల రికార్డులు
ఈ ఏడాది ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (వన్డేల్లో నంబర్ వన్, టెస్టుల్లో నం. టూ, టీ20లో నం 3) కోహ్లి సత్తా చాటుతుండగా.. టెస్ట్‌ల్లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న పుజారా మూడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో ఎవరికీ సాధ్యం కానిరీతిలో డబుల్ సెంచరీలు మూడు సాధించిన రోహిత్ శర్మ.. టీ-20లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.(సాక్షి ప్రత్యేకం) పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హార్థిక్ పాండ్యా తమదైన రికార్డులు నెలకొల్పాడు. ఈ సంవత్సరం టెస్టులకే పరిమితమైనా అద్భుత ప్రదర్శనతో టీంఇండియా విజయాలలో స్పిన్ ద్వయం అశ్విన్-జడేజాలు తమ వంతు పాత్ర పోషించారు. ఈ ఏడాది చివర్లో కోహ్లి తన పెళ్లి కోసం విరామం తీసుకోవడంతో అతని స్థానంలో కెప్టెన్‌గా రోహిత్ శ్రీలంకతో వన్డే, టీ20ల సిరీస్‌లో రాణించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఐపీఎల్ అదుర్స్, ముచ్చటగా మూడోసారి ముంబై
ఈ సారి ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. కొత్త ఆటగాళ్లు తెరపైకి వచ్చారు. కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముంబై కప్ గెలువడంలో కీలకపాత్ర పోషించింది. కోహ్లి ఉండటంతో బెంగళూర్‌పై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నా బౌలింగ్ బలహీనంగా ఉండటంతో ఈసారి బెంగళూరు జట్టు అభిమానులకు నిరాశ మిగిలించింది. (సాక్షి ప్రత్యేకం)
అదరగొట్టిన మహిళల క్రికెట్ టీం
క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది డబుల్ బొనాంజా అందించిందని చెప్పవచ్చు. పురుషుల జట్టు వరుస విజయాలతో అదరగొట్టగా.. మహిళల జట్టు అద్భుతమైన పోరాటపటిమతో ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకొని అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీరాజ్, ఏక్తాబిస్త్, జులాన్ గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్ తదితర మహిళా క్రికెటర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మొదటిసారిగా ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయగా.. టీమిండియా మ్యాచ్‌లకు భారత్‌లో విశేష ఆదరణ లభించింది. (సాక్షి ప్రత్యేకం)సెమీఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసీస్‌పై సెంచరీ చేసి జట్టును గెలిపించగా.. ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడినప్పటికీ.. భవిష్యత్‌లో మహిళల క్రికెట్ జట్టు అద్భుతాలు సాధించగలదని అభిమానుల్లో ఆశలు నింపింది.
చివర్లో పెళ్లి విందు
ఆటతోపాటు ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన విరాట్ కోహ్లి ఎట్టకేలకు తన ప్రియురాలు అనుష్క శర్మను పెళ్లాడారు. వీరిద్దరూ గత కొద్దిరోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిశాక హఠాత్తుగా విరామం తీసుకున్న కోహ్లి.. పెద్దగా హడావిడి లేకుండా ఇటలీకి వెళ్లి.. డిసెంబర్11న అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు. ఇటలీలోని టస్కనీ పట్టణంలో వీరి వివాహం కొద్దిమంది సన్నిహితుల నడుమ అట్టహాసంగా జరిగింది. ఇదిగో మా పెళ్లి ఇలా జరిగిందంటూ తమ పెళ్లి ఫొటోలను కోహ్లి, అనుష్క ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు.(సాక్షి ప్రత్యేకం) ఆ ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేశాయి. ఈ ఏడాది అతిపెద్ద పెళ్లి వేడుకగా ఇది నిలిచింది. అనంతరం ఢిల్లీలో, ముంబైలో కోహ్లి-అనుష్క జంట అన్ని రంగాల ప్రముఖులకు వివాహ విందు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment