
న్యూఢిల్లీ: వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా సెమీఫైనల్లో బజరంగ్ పూనియా పట్ల అంపైర్లు నిర్దయగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి స్థానిక కజకిస్తాన్ రెజ్లర్ నియజ్బెకొవ్ కావడమే పూనియాకు ప్రతి కూలంగా మారింది. 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరు 9–9 పాయింట్లతో సమంగా నిలవగా...‘బిగ్గర్ త్రో’ ఆధారంగా నియజ్బెకొవ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించారు. దీనిపై ఇప్పటికే పలువురు ధ్వజమెత్తగా తాజాగా భారత్ స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా మండిపడ్డాడు. ఓవరాల్ ప్రదర్శన చూడకుండా ఏకపక్షంగా కజికిస్తాన్ రెజ్లర్‌ను విజేతగా ప్రకటించడాన్ని తప్పుపట్టాడు. ‘ ఎవరైనా బజరంగ్- నియజ్బోకొవ్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సెమీస్ మ్యాచ్ చూశారా. అందులో ఎవరిది ఆధిపత్యమో స్పష్టంగా కనబడుతోంది.(ఇక్కడ చదవండి: బజరంగ్‌ను ఓడించారు)
అసలు అంపైర్లు మీరు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు. మీరు మ్యాచ్‌కు అంపైర్లగా ఉండి ఏమిటి ఉపయోగం. ఒక మెగా టోర్నమెంట్‌లో ఇంతటి పక్షపాతంగా వ్యవహరిస్తారా. ఎట్టిపరిస్థితుల్లోనూ కజికిస్తాన్ రూల్స్‌కు లోబడి ఆడలేదు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. నిన్నటి సెమీస్ మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయంపై బజరంగ్ అక్కడే తన అసహనాన్ని ప్రదర్శించాడు. అయినా రిఫరీలు పట్టించుకోలేదు. దీనిపై పూనియా కోచ్ షాకో బెనిటిడిస్ తీవ్రంగా మండిపడ్డారు. బజరంగ్ మెరుగైన త్రోలను పట్టించుకోలేదని... బౌట్‌ను పరిశీలిస్తే తమ రెజ్లర్‌కే అదనంగా రెండు పాయింట్లు వస్తాయని, గెలిచేందుకు అది సరిపోయేదని కోచ్ వివరించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో కొరియా రెజ్లర్ జొంగ్ చొయ్ సన్‌తో తలపడిన బజరంగ్ అలవోక విజయం సాధించాడు. 8–1 స్కోరుతో ప్రత్యర్థిని తేలిగ్గానే చిత్తు చేశాడు.