నంబర్‌వన్ సిరిల్
న్యూఢిల్లీ: తెలుగు కుర్రాడు అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ జూనియర్ బ్యాడ్మింటన్‌లో కొత్త ఘనతను సాధించాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం ప్రకటించిన తాజా జూనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సిరిల్ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 2014 జనవరిలో ఆదిత్య జోషి నంబర్‌వన్‌గా నిలిచాక... అగ్రస్థానానికి చేరిన రెండో భారతీయుడు సిరిల్. గత నవంబర్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి సిరిల్ సంచలనం సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ విజయంతో సిరిల్‌కు 5100 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. దాంతో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి అతను నంబర్‌వన్ అయ్యాడు.
గత కొంత కాలంగా జూనియర్ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఈ కుర్రాడు 2013లో ఆసియా అండర్-15 విజేతగా నిలిచాడు. అనంతరం అదే ఏడాది ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సొంతం చేసుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ కాంస్యం, జాతీయ అండర్-17 చాంపియన్‌షిప్‌తో పాటు పలు ర్యాంకింగ్ టైటిల్స్ అతని ఖాతాలో ఉన్నాయి. 16 ఏళ్ల సిరిల్ ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. తమ కుమారుడు నంబర్‌వన్ కావడం పట్ల అతని తల్లిదండ్రులు విజయరామరాజు, సుశీల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు.