పోరాడుతున్న పాక్
దుబాయ్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పోరాడుతోంది. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. దీంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసింది. యూనిస్ ఖాన్ (62 బ్యాటింగ్), మిస్బా (53 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మన్‌జూర్ (6), షెహజాద్ (9), హఫీజ్ (1) విఫలం కావడంతో పాక్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే యూనిస్, మిస్బాలు నాలుగో వికెట్‌కు అజేయంగా 113 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ప్రదీప్ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం పాక్ ఇంకా 91 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 318/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన లంక తొలి ఇన్నింగ్స్‌లో 134 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 223 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మాథ్యూస్ (42), జయవర్ధనే (278 బంతుల్లో 129; 15 ఫోర్లు) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బందులు పడటంతో లంక 68 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. జునైద్ 3, రాహత్, అజ్మల్ చెరో రెండు వికెట్లు తీశారు.