యువరాజు..మహరాజు! | Yuvraj hits the jackpot on day of smart spending | Sakshi
Sakshi News home page

యువరాజు..మహరాజు!

Published Thu, Feb 13 2014 12:50 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

యువరాజు..మహరాజు! - Sakshi

యువరాజు..మహరాజు!

ఐపీఎల్-7 వేలంలో అత్యధిక ధర
 రూ. 14 కోట్లకు బెంగళూరు సొంతం
 దినేశ్ కార్తీక్‌కు రూ. 12.5 కోట్లు
 సెహ్వాగ్‌పై పెద్దగా ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
 హైదరాబాద్ జట్టులో వార్నర్, ఫించ్, ఇర్ఫాన్

 
 మైదానంలో సిక్సర్ల వర్షమే కాదు... వేలంలోనూ జెట్‌స్పీడ్‌తో దూసుకుపోయాడు. ఒకటి, రెండు, మూడు అన్నంత సులువుగా నిమిషాల్లో కోట్లు కొల్లగొట్టేశాడు. మంచినీళ్ల ప్రాయంలా ఫ్రాంచైజీలు డబ్బుల వరద పారించడంతో ఐపీఎల్-7 వేలంలో డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్...పైసల సునామీ సృష్టించాడు. అంచనాలకు అందకుండా ఏకంగా రూ. 14 కోట్లకు అమ్ముడుపోగా, దినేశ్ కార్తీక్‌కు కూడా కళ్లు తిరిగే ధర లభించింది. పీటర్సన్, అండర్సన్‌లపై ఆసక్తి కనబర్చిన ఫ్రాంచైజీలు... సెహ్వాగ్‌కు మాత్రం నామమాత్రపు ధర ఇచ్చాయి.
 
 బెంగళూరు: భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్ కాకపోయినా... పొట్టి ఫార్మాట్‌లో తనెంత విలువైన ఆటగాడో యువరాజ్ సింగ్ నిరూపించుకున్నాడు. బుధవారం జరిగిన ఐపీఎల్-7 వేలంలో కళ్లు చెదిరే రీతిలో అమ్ముడుపోయాడు. యువీ కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించేందుకూ వెనుకాడలేదు. మొదట పంజాబ్, చివర్లో కోల్‌కతా ఎంత అడ్డుపడినా... బెంగళూరు రాయల్ చాలెంజర్స్ యజమాని విజయ్ మాల్యా మాత్రం అనూహ్యంగా రూ. 14 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. దినేశ్ కార్తీక్‌కు ఊహించని రీతిలో రూ.12.5 కోట్లు చెల్లించి ఢిల్లీ డేర్‌డెవిల్స్ దక్కించుకుంది.
 
 
 అధిక అంచనాలతో వేలంలోకి వచ్చిన కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్), అండర్సన్ (న్యూజిలాండ్)లకు వరుసగా రూ. 9 కోట్లు, రూ. 4.5 కోట్లు పెట్టారు. యాషెస్ హీరో జాన్సన్ రూ. 6.5 కోట్లకు అమ్ముడుపోయాడు. భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఓ దశలో అమ్ముడవుతాడో...లేదోనని భావించినా చివరకు పంజాబ్ తక్కువ మొత్తానికి (రూ.3.20 కోట్లు) దక్కించుకుంది. అంతర్జాతీయ స్టార్లలో చాలా మందిని ఎవరూ కొనుగోలు చేయలేదు. లీగ్ మొత్తం అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో లంక ఆటగాళ్లను పెద్దగా పట్టించుకోలేదు. ఫ్రాంచైజీల యజమానులు, బాలీవుడ్ స్టార్లు, కోచ్‌లు, మాజీ ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొన్నారు.
 
 వేలం విశేషాలు
 సరిగ్గా 9 గంటల 31 నిమిషాలకు ఫ్రాంచైజీల అధికారులు వేలం పాటలో కూర్చున్నారు.
 వేలం గురించి ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్, సీఈఓ సుందర్‌రామన్ మాట్లాడారు. వేలాన్ని రూపాయాల్లో నిర్వహించారు.
 
 ద్రవిడ్ (రాజస్థాన్), నీతా అంబానీ, అనిల్ కుంబ్లే (ముంబై), లక్ష్మణ్, శ్రీకాంత్ (హైదరాబాద్), ఫ్లెమింగ్ (చెన్నై), విజయ్ మల్యా, వెటోరి (బెంగళూరు), కిర్‌స్టెన్, సిమన్స్ (ఢిల్లీ), జూహీ చావ్లా (కోల్‌కతా), నెస్ వాడియా, ప్రీతి జింతా (పంజాబ్)లు తమ ఫ్రాంచైజీల తరఫున వేలంలో చురుగ్గా పాల్గొన్నారు.
 
 వేలాన్ని మొదలుపెట్టిన రిచర్డ్ మ్యాడ్లీకి ఆటగాళ్ల పేర్లున్న బెయిల్స్ (ఒక్కో సెట్)ను ఐపీఎల్ కౌన్సిల్ సభ్యులు ఒక్కోసారి ఒక్కొక్కరు అందించారు.
 
 మురళీ విజయ్ పేరు మొదట వేలానికి వచ్చింది. ఢిల్లీ, చెన్నై, ముంబై తీవ్రంగా పోటీపడ్డాయి. మధ్యలో హైదరాబాద్ పోటీకి దిగినా చివరకు ఢిల్లీ సొంతం చేసుకుంది.
 తర్వాత జయవర్ధనే పేరును పిలిచారు. కానీ ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు.
 
 పీటర్సన్ పేరు రావడంతో చెన్నై వేగంగా బిడ్‌ను పెంచుకుంటూ పోయింది. మధ్యలో పంజాబ్ రూ. 3 కోట్లకు పాడినా.. సన్‌రైజర్స్, చెన్నై హోరాహోరీగా పోటీపడ్డాయి. చివరకు సన్‌రైజర్స్‌కు దక్కిన పీటర్సన్‌ను ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా ఢిల్లీ ఎగరేసుకుపోయింది.    
 
 ఆల్‌రౌండర్లను బాగా ఇష్టపడే చెన్నై... కలిస్ కోసం బిడ్‌ను ఓపెన్ చేసింది. ఢిల్లీ, కోల్‌కతాలు గట్టిపోటీ ఇచ్చినా వెనక్కి తగ్గకుండా సొంతం చేసుకుంది. అయితే ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా కోల్‌కతా తీసేసుకుంది. ఓ దశలో మూడు కోట్లకే వచ్చే అవకాశమున్నా... కోల్‌కతా అనాలోచిత నిర్ణయంతో రేటు భారీగా పలికింది.
 
 సెహ్వాగ్‌పై ఆరంభంలో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. చివరి నిమిషంలో ముంబై బిడ్‌ను ఓపెన్ చేస్తే పంజాబ్ పోటీకి దిగింది. ఈ రెండు జట్లే కాస్త బిడ్‌ను పెంచుకుంటూ పోయాయి.
 
 వార్నర్ కోసం ముంబై బిడ్ వేసింది. సన్‌రైజర్స్ గట్టిపోటీ ఇచ్చి దక్కించుకుంది. ఢిల్లీ ‘రైట్ టు మ్యాచ్’ కార్డును వాడలేదు.
 
 మిచెల్ జాన్సన్ కోసం చెన్నై చాలాసేపు పోరాడింది. కానీ పంబాజ్ ఎక్కువ మొత్తం వెచ్చించింది. ముంబై ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ఉన్నా ఉపయోగించలేదు.
 
 యూసుఫ్ పఠాన్‌ను హైదరాబాద్ గెలుచుకున్నా... ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా కోల్‌కతా తక్కువ రేటుకే ఎగరేసుకుపోయింది.
 
 ఇటీవలీ కాలంలో హాట్ టాపిక్‌గా మారిన కోరీ అండర్సన్ కోసం ముంబై, రాజస్థాన్ బిడ్‌ను ప్రారంభించాయి. తర్వాత ఢిల్లీ, హైదరాబాద్ రంగంలోకి దిగినా ముంబై దక్కించుకుంది. అండర్సన్‌పై అంచనాలు అధికంగా ఉన్నప్పటికీ ఓ మోస్తరు ధరకే కొనుగోలు చేశారు. గత సీజన్లలో కెప్టెన్లుగా చేసిన డేవిడ్ హస్సీ, వైట్‌లను ఎవరూ కొనకపోవడం ఆశ్చర్యకరమైన అంశం. ఇటీవల భారత్‌తో ఒకే ఒక్క వన్డే ఆడిన కివీస్ పేసర్ మాట్ హెన్రీని కనీస ధరకే చెన్నై సొంతం చేసుకుంది.
 
 రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను కలుపుకొని వేలం పాట పూర్తయ్యే సరికి ఒక్కో ఫ్రాంచైజీ 16 మంది ప్లేయర్లను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ప్రతీ జట్టులో 9 మంది విదేశీ ఆటగాళ్లను మించి కొనుగోలు చేయడానికి వీల్లేదు. గరిష్టంగా 27 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. ఇక ఐపీఎల్ వేలంలో నేడు అన్‌క్యాప్డ్ ప్లేయర్ల వేలం పాట ఉంటుంది. బుధవారం వేలంలో అమ్ముడు పోని వారిలో ఎవరినైనా తీసుకోవాలని ఫ్రాంఛైజీలు భావిస్తే గురువారం మళ్లీ వేలంలోకి తేవొచ్చు.
 
 రూ. 212.35కోట్లు
 తొలి రోజు వేలంలో ఫ్రాంఛైజీలు చేసిన ఖర్చు
 
 70 తొలి రోజు వేలంలో అమ్ముడైన ఆటగాళ్లు
 
 146 తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల సంఖ్య
 
 18 వేలంలో అమ్ముడిపోని భారత క్రికెటర్ల సంఖ్య
 
  యువీ ఎక్స్‌ట్రా ‘ఫోర్’
 వేలంలో యువరాజ్ సింగ్ కోసం పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. అతని కనీస ధర రూ. 2 కోట్లతో పంజాబ్ ముందుగా మొదలు పెట్టింది. ఆ తర్వాత రాజస్థాన్ రూ. 2.25 కోట్లకు, మళ్లీ పంజాబ్ రూ. 3.20 కోట్లకు పెంచాయి. ఈ దశలో బెంగళూరు బరిలోకి దిగి రూ. 3.50 కోట్లు చెప్పింది...అది అలా అలా పెరుగుతూ చివరకు రూ. 10 కోట్లకు బెంగళూరు ఓకే చేసింది. అయితే ఈ దశలో కాస్త గందరగోళం ఏర్పడింది.
 
 కోల్‌కతా టీమ్ రంగప్రవేశం చేసి వేలం సమయంలో తమకు ఎవరో అడ్డుగా రావడంతో సరిగా చూడలేకపోయామని...తామూ బిడ్ వేస్తామని కోరింది. దీనికి నిర్వాహకులు అంగీకరించడంతో వేలం మళ్లీ కొనసాగింది. చివరకు కోల్‌కతాను వెనక్కి నెట్టి బెంగళూరు రూ. 14 కోట్లకు యువీని సొంతం చేసుకుంది. అలా అతని విలువ మరో రూ. 4 కోట్లు పెరిగింది. ‘మా కెప్టెన్ కోహ్లి పట్టుదలగా ఉండటం వల్లే ఎంత మొత్తమైనా యువీని సొంతం చేసుకోవాలనుకున్నా. రూ. 4 కోట్లు పెరగడం దురదృష్టకరం. యువీని ఖరారు చేసే సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు’ అని విమర్శించిన మాల్యా దీనిపై గవర్నింగ్ కౌన్సిల్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
 
 ఇక గంగ్‌నమే..
 ఆర్‌సీబీ లాంటి భారీ జట్టుతో ఆడనుండటం అదృష్టం. గేల్‌కు ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.
 -యువరాజ్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement