ఐపీఎల్-7 ఫైనల్ ఎక్కడ జరుగుతుందనే సస్పెన్స్‌కు తెర పడింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే జూన్ 1న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్నట్టు ఐపీఎల్ పాలక మండలి (జీసీ) ప్రకటించింది.
ఐపీఎల్ పాలక మండలి స్పష్టీకరణ
ముంబై: ఐపీఎల్-7 ఫైనల్ ఎక్కడ జరుగుతుందనే సస్పెన్స్‌కు తెర పడింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే జూన్ 1న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్నట్టు ఐపీఎల్ పాలక మండలి (జీసీ) ప్రకటించింది. వాస్తవానికి ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ జట్టు వేదికపై ఫైనల్ జరగడం ఆనవాయితీ. దీని ప్రకారం గతేడాది విజేత ముంబై ఇండియన్స్ వేదిక అయిన వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే జీసీ దీన్ని బెంగళూరుకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ముంబై క్రికెట్ సంఘ (ఎంసీఏ) తమ నిరసనను వ్యక్తం చేస్తూ లేఖ రాసింది.
దీనికి ప్రతిగా తమ షరతులు అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుందని లీగ్ చైర్మన్ రంజీబ్ బిశ్వాల్ ఎంసీఏకు లేఖ రాశారు. దీనికి వారు అంగీకరించినా శనివారం రాత్రి జరిగిన లీగ్ పాలక మండలి సమావేశంలో మాత్రం తాము ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడింది. ‘జీసీలో ఫైనల్ ఎక్కడ జరపాలనే దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎంసీఏ వినతిని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. అయితే చివరకు బెంగళూరే ఉత్తమమని ఏకగ్రీవంగా నిర్ణయించాం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.