యువీ, ధోనిలు కుమ్మేస్తున్నారు!
కటక్:మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిలు కుమ్మేస్తున్నారు. భారత జట్టు 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో యువీ-ధోనిల జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపెడుతుంది.
వీరిద్దరూ తమదైన శైలిలో చెలరేగిపోతూ 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని సాధించారు. తొలుత యువరాజ్ సింగ్ 56 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేయగా, ఆ తరువాత కాసేపటికి ధోని 68 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థ శతకం నమోదు చేశాడు. వీరిద్దరూ ఆకట్టుకోవడంతో భారత జట్టు 31.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.కేఎల్ రాహుల్(5), కోహ్లి(8), ధవన్(11)లు స్వల్ప వ్యవధిలో నిష్క్రమించి నిరాశపరిచారు. ఆపై యువీ-ధోనిల జోడి బాధ్యాయుతంగా ఆడి భారత్ జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ 98 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం సాధించాడు. యువరాజ్ తన కెరీర్లో 14 వన్డే సెంచరీ సాధించగా, ఐదేళ్ల తరువాత అతనికి ఇదే తొలి సెంచరీ. 2011లో జరిగిన వరల్డ్ కప్లో వెస్టిండీస్ పై యువరాజ్ చివరిసారి వన్డే శతకం సాధించాడు.