శ్రీకాకుళం పాతబస్టాండ్: గత ఏడాది జనవరి 7న జరిగిన అగ్ని ప్రమాదంలో 17 ఇళ్లు కోల్పోయామని, ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ఇళ్లు మంజూరు చేయలేదని గార మండలంలోని కొర్ని గ్రామానికి చెందిన బాధితులు ముంత స్వప్న, మల్లేశు, రాజప్పడు, సూరయ్య, నాగమణి, రాము, తదితరులు గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ ధనంజయరెడ్డికి తెలిపారు. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. తమను ఆదుకోవాలని విన్నవించారు. సోమవారం గ్రీవెన్సుకి ఎక్కువగా వినతులు వచ్చాయి. ఇందులో కలెక్టర్‌తో పాటు జేసీ–2 పి.రజనీకాంతరావు, డీఆర్‌డీఏ పీడీ జి.సి.కిషోర్ కుమార్, డ్వామా పీడీ హెచ్. కూర్మారావు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ వారం వచ్చిన వినతుల్లో కొన్నింటిని పరిశీలించగా..
♦ స్వీట్ దుకాణాలకు సంబంధించి తయారీ కేంద్రాలను అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని శ్రీకాకుళం నగరం కాకివీధి స్థానికులు జి. మోహన్, జి.సురేష్, బాబా శ్రీధర్, తదితరులు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. పదుల సంఖ్యలో సిలెండర్లు ఉపయోగిస్తున్నారని, కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల ప్రమాదం జరిగిందని, వీటి తయారీని అడ్డుకోవాలని కోరారు.
♦ మహాశివరాత్రి సందర్భంగా ఈ ఏడాది శ్రీముఖలింగం ఆలయంలో మౌలిక సదుపాయాలు కల్పించి భక్తులకు వసతి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామానికి చెందిన నాయుడుగారి రాజశేఖర్ కోరారు.
♦ హిరమండలంలోని గార్లపాడు గ్రామానికి చెందిన నిర్వాసిత కుటుంబాలు 66 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసినా స్థలం అప్పగించలేదని వీరు కోరారు.
♦ కొన్నేళ్లుగా పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బధిరుల పోస్టులను భర్తీ చేయాలని బధిరుల సంఘం ప్రతినిధులు సి.హెచ్.సరీమ్, ఎస్.భీమాస్వరాజ్, జి.విద్యాసాగర్, తదితరులు గ్రీవెన్సులో కోరారు. ఏటా నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నామని, ఈ ఏడాది మొత్తం పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలన్నారు.
రక్షణ కల్పించండి
తన పొలంలో బోరుబావికి విద్యుత్ సర్వీసు ఇవ్వకపోవడంతో గత ఏడాది కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన రైతు టంకాల మోహనరంగ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు వచ్చారు. ఆ సమయంలో రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి హామీ ఇచ్చారు. అయితే వారం రోజులయినా సమస్య పరిష్కారం కాలేదని కలెక్టర్‌కు తెలిపారు. అంతేగాక తనను బెదిరించడంతో పాటు విద్యుత్ అధికారులను కూడా భయభ్రాంతులకు గురిచేశారని వివరించారు. తనకు రక్షణతోపాటు, విద్యుత్ సర్వీసు ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఆయనతో పాటు ఏపీ రైతు సంఘం కార్యదర్శి కె.నారాయణరావు, వి.రమణ, టి.మోహనరావు ఉన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కు 20 ఫిర్యాదులు
శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 20 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ స్వీకరించారు. త్వరతిగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సివిల్ తగాదాలు– 4, కుటుంబ తగాదాలు– 2, పాతకేసులు–1, ఇతర సమస్యలకు సంబంధించి 13 ఫిర్యాదులు వచ్చాయి. మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ శ్యామలరావు నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు 11 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో మహిళా ఎస్‌ఐ వాణిశ్రీ, విశ్రాంత ఎస్‌ఐ పి.రాజేశ్వరరావు, టి వరప్రసాద్, నిర్మల, విజయకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment