సాక్షి, ముంబై: నగరంలోని డాక్‌యార్డ్ రోడ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఐదంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది చనిపోగా, 26 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 18 మందిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ప్రమాదం జరిగిన సమయంలో శిథిలాల కింద వందమందిపైగా శిథిలాల్లో చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే కచ్చితంగా ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మాత్రం తేల్చలేకపోయారు.
బాబు గెనూ మార్కెట్ పరిసరాల్లో భవనం కూలినట్లు సమాచారం అందుకున్న వెం టనే రెండు పోలీసు వ్యాన్లు, 12 అగ్నిమాపక శకటాలు, నాలుగు అంబులెన్స్‌లతోపాటు రెండు సహాయక బృందాలకు చెందిన 65 మంది జవాన్లు అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని జేజే, నాయర్ ఆస్పత్రులకు తరలించారు. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఓ గోదాంలో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ప్రమాదానికి ప్రధాన కారణం మాత్రం తెలియరాలేదన్నారు. మృతుల్లో నలుగురిని లీలా ఛావ్డా (60), అనంత్ గవార్ (45), జమున కుమారి ఛావ్డా (30), అనిల్ ఛావ్డా (28)లు గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. కాగా ఈ భవనంలో మొత్తం 21 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది 30 సంవత్సరాల క్రితం నిర్మితమైంది.
6 నెలల కాలంలో 106 మంది బలి
నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు నేలమట్టమవుతున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ డిచిన ఆరు నెలల కాలంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం 106 మంది మరణించగా, 100 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఒక్క జూన్ నెలలోనే ఐదు భవనాలు నేలకూలాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు వర్షాకాలంలో పేకమేడల మాదిరిగా కూలిపోతున్నాయి. నాణ్యతను పట్టించుకోకపోవడంతోపాటు అత్యంత తక్కువ వ్యవధిలో నిర్మించడం కూడా ఈ ఘటనలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరినవాటితోపాటు అక్రమంగా నిర్మించిన భవనాల్లో నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాగా ఠాణేలోని శీల్‌ఫాటా వద్ద అక్రమంగా నిర్మించిన ఏడంతస్తుల భవనం కూలినపోయి 72 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మే ఒకటో తేదీన భివండీ బండారీ కాంపౌండ్ ప్రాంతంలోని మరమగ్గాల కార్ఖానా కూలిపోయి ంది. ఈ ఏడాది జూన్‌లో రుతుపవనాల రాకతో నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వర్షాలు ప్రారంభమయ్యాయి.
అదే నెల 10వ తేదీన మాహింలోని ఛోటాదర్గా పరిసరాల్లోగల ఐదంతస్తుల అల్తాఫ్ మేన్షన్ భవనం పాక్షికంగా కూలిపోయింది. ఆ తర్వాత అదే నెల 18వ తేదీ ఉదయం మాహింలోని రైల్ వ్యూ భవనం, భయిందర్‌లోని మహేష్‌నగర్‌లోగల భవనాలు పాక్షికంగా నేలకూలాయి. అయితే ఈ రెండు ఘటనల్లో ప్రాణహాని జరగలేదు. కేవలం కొంతమంది గాయపడ్డారు. జూన్ 22వ తేదీన దహిసర్‌లోని పీయూష్ భవనం నేలకూలింది. అయితే ఈ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. ఐదుగురు చిరువ్యాపారులు చనిపోయారు. ఆ తర్వాత జూలై నెల నాలుగో తేదీన భివండీలోని హరియంత్ కాంపౌడ్‌లో రెండంతస్తుల భవనం నేలకూలింది. ఈ ఘటనలో వస్త్రకర్మాగారంలో పనిచేసే ఎనిమిదిమంది మరణించగా, 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆ తర్వాత వానలు ఆగిపోయినప్పటికీ ఈ ఘటనలు మాత్రం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముంబ్రాలోని బానో పార్క్ అనే ఐదంతస్తుల భవనం ఈ నెల 21వ తేదీన నేలకూలింది. రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటనను మరిచిపోకముందే డాక్‌యార్డ్‌లో కార్పొరేషన్ కార్మికులు నివసించే భవనం శుక్రవారం నేలకూలింది.
కొద్దిరోజులపాటు హడావుడి
భవనాలు కూలిన ఘటనలు జరిగిన సమయంలోనే ప్రభుత్వంతోపాటు, రాజకీయ నాయకులు, స్థానిక సంస్థలకు ప్రజల భద్రత అంశం గుర్తుకొస్తుందంటూ అనేక మంది ఆరోపిస్తున్నారు. కొద్దిరోజులపాటు హంగామా చేయడం, ఆ తర్వాత మరిచిపోవడం బాగా అలవాటైపోయిందని వారంటున్నారు. ఏప్రిల్ నెలలో శీల్‌ఫాటా లక్కీ కాంపౌండ్‌లో భవనం నేలకూలిన ఘటనలో 72 మంది మరణించగా, అనేకమంది గాయపడిన విషయం విదితమే. ఆ తర్వాత ముంబై, ఠాణేలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కట్టడాలు, శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసించే వారి భద్రత అంశం తెరపైకి వచ్చింది. కాగా ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితిని మీక్షించారు.
డాక్‌యార్డులో కూలిన భవనం: 12 మంది మృతి
Published Sat, Sep 28 2013 12:00 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement