Mumbai building collapse
-
నిట్టనిలువునా కుప్పకూలింది
ముంబైలో కూలిన పాత ఐదంతస్తుల భవనం 34 మంది మృతి, 15 మందికి గాయాలు ♦ త్రుటిలో తప్పించుకున్న 50 మంది ప్లేస్కూలు చిన్నారులు ♦ ఈ భవనం ప్రమాదకరమని గతంలో నోటీసులు సాక్షి, ముంబై: భారీవర్షాలకు అతలాకుతలమైన ముంబై నగరంలో మరో ఘోరం చోటుచేసుకుంది. వర్ష బీభత్సం నుంచి కోలుకుంటున్న ముంబైలో గురువారం ఉదయం 117 ఏళ్ల పురాతన ఐదంతస్తుల భవనం కుప్పకూలడంతో 34 మంది ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు. ముంబై దక్షిణ ప్రాంతం భెండీ బజార్‌లోని హుస్సేనీ బిల్డింగ్ ఉదయం 8.24 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాలను తొలగించేందుకు అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు 10 అగ్నిమాపక బృందాలు, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల నుంచి వెలికితీసిన వారిని చికిత్స కోసం సమీపంలోని జేజే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిని స్ట్రెచర్లపై ఇరుకైన రోడ్ల వెంబడి జేజే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సహాయక సిబ్బంది కష్టించాల్సి వచ్చింది. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా స్వల్పంగా గాయపడ్డారని, వారికి కూడా జేజే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో శిథిలాలను తొలగించేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. దాదాపు 40 మంది నివసిస్తున్నారని అంచనా: అధికారులు కుప్పకూలిన హుస్సేనీ భవనంలో 9 కుటుంబాలకు చెందిన 40 మంది నివసిస్తున్నారని అగ్నిమాపక విభాగ అధికారులు వెల్లడించారు. భవనం మొదట్లో మూడంతస్తులే కాగా.. 20 ఏళ్ల క్రితం అనుమతులు లేకుండా అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడ్డవారి వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో ఇంకా స్పష్టత లేదని డీసీపీ మనోజ్ శర్మ చెప్పారు. సహాయక చర్యలు పూర్తయ్యాక, ప్రమాద కారణాలపై విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నోటీసులిచ్చినా ఖాళీ చేయలేదు.. ఈ భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ మహారాష్ట్ర హౌసింగ్, ఏరియా డవలప్మెంట్ అథారిటీ(ఎంహెచ్ఏడీఈ) 2011లో నోటీసులిచ్చింది. కొన్ని కుటుంబాలు ఖాళీ చేశా యి. రవాణా ఖర్చులు భరిస్తామన్నా... ఖాళీ చేసేందుకు మిగతా కుటుంబాల వారు ఒప్పుకోలేదు. భవనాన్ని ప్రమాదకరంగా ప్రకటిం చడంతో ‘ద సైఫీ బుర్హానీ పునరుద్ధరణ ట్రస్ట్, మరమ్మతులు చేపట్టింది. 2013–14లో ఏడు కుటుంబాల్ని తరలించింది. చిన్నారులు బతికిపోయారు దాదాపు 50 మంది చిన్నారులు ఈ ఘోర ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ భవనంలో ఒక ప్లే స్కూల్‌ను నడుస్తోంది. మరో 20 నిమిషాల్లో ఆ పాఠశాల ప్రారంభం కానుంది. అకస్మాత్తుగా ఆ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ స్కూల్ ప్రారంభం కాకముందే ఈ దుర్ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. మరో 20 నిమిషాలు ఆలస్యమైతే దారుణం చోటు చేసుకునేది. ‘మా బాబును తీసుకుని అప్పుడే స్కూల్‌కు వస్తున్నాను. నా కళ్లముందే భవనం కుప్పకూలింది. కూలడం కాస్త ఆలస్యమైతే అన్న ఆలోచనే నాకు వెన్నులో వణుకు తెప్పించింది’ అంటూ ఓ చిన్నారి తండ్రి వణికిపోయాడు. -
నేలమట్టం
సాక్షి, ముంబై: తూర్పు శాంతాక్రజ్ వాకోలాలో శంకర్లోక్ అనే ఏడంతస్తుల భవనం నేల కూలింది. యశ్వంత్నగర్లో శుక్రవారం మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయలయ్యాయి. ఈ భవనంలోని గదులన్నీ దాదాపు ఖాళీగా ఉండడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అయితే కూలిన ఈ భవనం పొరుగునే ఉండే మురికివాడల చాల్స్పై పడడంతో అందులో నివసించేవారు శిథిలాల కింద దుర్మరణం చెందారు. మరికొందరు శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శిథిలాలను పూర్తిగా తొలగించిన అనంతరమే పూర్తి వివరాలు తెలుస్తాయని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. చూస్తుండగానే సజీవ సమాధి.... వాకోలా యశ్వంత్నగర్లో చూస్తుండగానే పలువురు సజీవసమాధి అయ్యారు. శంకర్లోక్ అనే ఏడంతస్తుల భవనం సుమారు 35 ఏళ్లనాటిదని తెలిసింది. శిథిలావస్థకు చేరడంతో ఈ భవనాన్ని ప్రమాదకర భవనంగా గుర్తించిన బీఎంసీ అందుటో నివసించే వారిని ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో అనేక మంది ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే ప్రత్యామ్నయంగా ట్రాన్సిస్ట్ క్యాంప్‌లు, ఇతర కారణాల వల్ల రెండు కుటుంబాలు మాత్రం ఇంకా ఖాళీ చేయకుండా అందులోని ఉంటున్నాయి. దీంతోపాటు భవనం చుట్టుపక్కల మురికివాడలు (చాల్స్) ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన ఇలాంటి భవనాలు వర్షకాలంలో అత్యధికంగా నేలకూలుతూ ఉండడం అందరికి తెలిసిందే. కానీ ప్రస్తుత సమయంలో ఎవరూ ఊహించని విధంగా శంకర్లోక్ అనే ఏడంతస్తుల భవనం అందరుచూస్తుండగా కుప్పకూలింది. భారీ శబ్ధం రావడంతో అందరూ పరుగెత్తేందుకు ప్రయత్నించిన అనేకమంది, పొరుగునే ఉన్న చాల్స్పై ఈ భవనం శిథిలాలు పడడంతో వారుకూడా శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, బీఎంసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించే పనులు ప్రారంభించారు. ప్రారంభంలో ఒకరిద్దరిని సురక్షితంగా బయటకి తీశారు. దీంతో శిథిలాలను తొలగించే పనులు చాలా జాగ్రత్తగా కొనసాగించారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని వెలికితీశారు. రాత్రి 7.30 గంటల వరకు మొత్తం 11 మందిని బయటికి తీశారు. వీరిలో అప్పటికే ఆరుగురు విగతజీవులైనట్టు గుర్తించారు. ఇలా ఆరుగురు సజీవసమాధి అయ్యారు. గాయపడిన మరో నలుగురిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నారని భావిస్తుండడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు మరణించిన వారిలో ఇద్దరి మహిళలను గుర్తించారు. వీరిలో సుధా శ్రీధరన్ (32), చందనాబేన్ పటేల్ (50)లు ఉన్నారు. మిగిలిన నలుగురి వివరాల ఇంకా తెలియరాలేదు. మరోవైపు గాయలైనవారిలో సీతా కేసకర్ (60), రోహిణి జగతాప్ (47), అక్షయ్ కేసకర్ (18)ఉన్నారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముంబై భవనం కూలిన ఘటనలో బీఎంసీ అధికారులు అరెస్ట్
ముంబై నగరంలో మాజ్‌గావ్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 33 ఏళ్ల క్రితం కట్టిన ఆ భవనం శిథిలావస్థలో ఉందని, నివాసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయించి ఆ భవనానికి మరమ్మతులు నిర్వహించాలని ఇటీవల తనిఖీలకు వెళ్లిన బీఎంసీ అధికారులు ఆ భవన యజమానిని ఆదేశించించారు. అయితే యజమాని బీఎంసీ అధికారుల ఆదేశాలను భేఖాతరు చేశాడు. అదికాక భవన కింద సెల్లార్లో ఓ సంస్థకు యజమాని అద్దెకు ఇచ్చాడు. దాంతో సెల్లారులో మరమత్తులు నిర్వహించాడు. ప్రమాదం జరిగేందుకు అవి కూడా కారణమని మున్సిఫల్ అధికారులు భావిస్తున్నారు. అయితే భవనం కూలడానికి బీఎంసీ అధికారుల ఉదాసీనతే కారణమని ప్రభుత్వం భావించింది. దాంతో ముగ్గురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు. అయితే భవనం కుప్పకూలిన ఘటనలో మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. లక్ష పరిహారాన్ని మహారాష్ట్ర సీఎం పృద్దీరాజ్ చవాన్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఒకొక్క మృతుని కుటుంబానికి రూ.2 ఇస్తున్నట్లు ముంబై నగర మేయర్ సునీల్ ప్రభు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
డాక్‌యార్డులో కూలిన భవనం: 12 మంది మృతి
సాక్షి, ముంబై: నగరంలోని డాక్‌యార్డ్ రోడ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఐదంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది చనిపోగా, 26 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 18 మందిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ప్రమాదం జరిగిన సమయంలో శిథిలాల కింద వందమందిపైగా శిథిలాల్లో చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే కచ్చితంగా ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మాత్రం తేల్చలేకపోయారు. బాబు గెనూ మార్కెట్ పరిసరాల్లో భవనం కూలినట్లు సమాచారం అందుకున్న వెం టనే రెండు పోలీసు వ్యాన్లు, 12 అగ్నిమాపక శకటాలు, నాలుగు అంబులెన్స్‌లతోపాటు రెండు సహాయక బృందాలకు చెందిన 65 మంది జవాన్లు అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని జేజే, నాయర్ ఆస్పత్రులకు తరలించారు. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఓ గోదాంలో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ప్రమాదానికి ప్రధాన కారణం మాత్రం తెలియరాలేదన్నారు. మృతుల్లో నలుగురిని లీలా ఛావ్డా (60), అనంత్ గవార్ (45), జమున కుమారి ఛావ్డా (30), అనిల్ ఛావ్డా (28)లు గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. కాగా ఈ భవనంలో మొత్తం 21 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది 30 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. 6 నెలల కాలంలో 106 మంది బలి నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు నేలమట్టమవుతున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ డిచిన ఆరు నెలల కాలంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం 106 మంది మరణించగా, 100 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఒక్క జూన్ నెలలోనే ఐదు భవనాలు నేలకూలాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు వర్షాకాలంలో పేకమేడల మాదిరిగా కూలిపోతున్నాయి. నాణ్యతను పట్టించుకోకపోవడంతోపాటు అత్యంత తక్కువ వ్యవధిలో నిర్మించడం కూడా ఈ ఘటనలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరినవాటితోపాటు అక్రమంగా నిర్మించిన భవనాల్లో నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాగా ఠాణేలోని శీల్ఫాటా వద్ద అక్రమంగా నిర్మించిన ఏడంతస్తుల భవనం కూలినపోయి 72 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మే ఒకటో తేదీన భివండీ బండారీ కాంపౌండ్ ప్రాంతంలోని మరమగ్గాల కార్ఖానా కూలిపోయి ంది. ఈ ఏడాది జూన్‌లో రుతుపవనాల రాకతో నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వర్షాలు ప్రారంభమయ్యాయి. అదే నెల 10వ తేదీన మాహింలోని ఛోటాదర్గా పరిసరాల్లోగల ఐదంతస్తుల అల్తాఫ్ మేన్షన్ భవనం పాక్షికంగా కూలిపోయింది. ఆ తర్వాత అదే నెల 18వ తేదీ ఉదయం మాహింలోని రైల్ వ్యూ భవనం, భయిందర్లోని మహేష్నగర్లోగల భవనాలు పాక్షికంగా నేలకూలాయి. అయితే ఈ రెండు ఘటనల్లో ప్రాణహాని జరగలేదు. కేవలం కొంతమంది గాయపడ్డారు. జూన్ 22వ తేదీన దహిసర్‌లోని పీయూష్ భవనం నేలకూలింది. అయితే ఈ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. ఐదుగురు చిరువ్యాపారులు చనిపోయారు. ఆ తర్వాత జూలై నెల నాలుగో తేదీన భివండీలోని హరియంత్ కాంపౌడ్లో రెండంతస్తుల భవనం నేలకూలింది. ఈ ఘటనలో వస్త్రకర్మాగారంలో పనిచేసే ఎనిమిదిమంది మరణించగా, 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆ తర్వాత వానలు ఆగిపోయినప్పటికీ ఈ ఘటనలు మాత్రం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముంబ్రాలోని బానో పార్క్ అనే ఐదంతస్తుల భవనం ఈ నెల 21వ తేదీన నేలకూలింది. రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటనను మరిచిపోకముందే డాక్‌యార్డ్‌లో కార్పొరేషన్ కార్మికులు నివసించే భవనం శుక్రవారం నేలకూలింది. కొద్దిరోజులపాటు హడావుడి భవనాలు కూలిన ఘటనలు జరిగిన సమయంలోనే ప్రభుత్వంతోపాటు, రాజకీయ నాయకులు, స్థానిక సంస్థలకు ప్రజల భద్రత అంశం గుర్తుకొస్తుందంటూ అనేక మంది ఆరోపిస్తున్నారు. కొద్దిరోజులపాటు హంగామా చేయడం, ఆ తర్వాత మరిచిపోవడం బాగా అలవాటైపోయిందని వారంటున్నారు. ఏప్రిల్ నెలలో శీల్ఫాటా లక్కీ కాంపౌండ్‌లో భవనం నేలకూలిన ఘటనలో 72 మంది మరణించగా, అనేకమంది గాయపడిన విషయం విదితమే. ఆ తర్వాత ముంబై, ఠాణేలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కట్టడాలు, శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసించే వారి భద్రత అంశం తెరపైకి వచ్చింది. కాగా ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితిని మీక్షించారు.