సాక్షి, ముంబై: తూర్పు శాంతాక్రజ్ వాకోలాలో శంకర్‌లోక్ అనే ఏడంతస్తుల భవనం నేల కూలింది. యశ్వంత్‌నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయలయ్యాయి. ఈ భవనంలోని గదులన్నీ దాదాపు ఖాళీగా ఉండడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అయితే కూలిన ఈ భవనం పొరుగునే ఉండే మురికివాడల చాల్స్‌పై పడడంతో అందులో నివసించేవారు శిథిలాల కింద దుర్మరణం చెందారు. మరికొందరు శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శిథిలాలను పూర్తిగా తొలగించిన అనంతరమే పూర్తి వివరాలు తెలుస్తాయని కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
చూస్తుండగానే సజీవ సమాధి....
వాకోలా యశ్వంత్‌నగర్‌లో చూస్తుండగానే పలువురు సజీవసమాధి అయ్యారు. శంకర్‌లోక్ అనే ఏడంతస్తుల భవనం సుమారు 35 ఏళ్లనాటిదని తెలిసింది. శిథిలావస్థకు చేరడంతో ఈ భవనాన్ని ప్రమాదకర భవనంగా గుర్తించిన బీఎంసీ అందుటో నివసించే వారిని ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో అనేక మంది ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే ప్రత్యామ్నయంగా ట్రాన్సిస్ట్ క్యాంప్‌లు, ఇతర కారణాల వల్ల రెండు కుటుంబాలు మాత్రం ఇంకా ఖాళీ చేయకుండా అందులోని ఉంటున్నాయి. దీంతోపాటు భవనం చుట్టుపక్కల మురికివాడలు (చాల్స్) ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన ఇలాంటి భవనాలు వర్షకాలంలో అత్యధికంగా నేలకూలుతూ ఉండడం అందరికి తెలిసిందే. కానీ ప్రస్తుత సమయంలో ఎవరూ ఊహించని విధంగా శంకర్‌లోక్ అనే ఏడంతస్తుల భవనం అందరుచూస్తుండగా కుప్పకూలింది.
భారీ శబ్ధం రావడంతో అందరూ పరుగెత్తేందుకు ప్రయత్నించిన అనేకమంది, పొరుగునే ఉన్న చాల్స్‌పై ఈ భవనం శిథిలాలు పడడంతో వారుకూడా శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, బీఎంసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించే పనులు ప్రారంభించారు. ప్రారంభంలో ఒకరిద్దరిని సురక్షితంగా బయటకి తీశారు. దీంతో శిథిలాలను తొలగించే పనులు చాలా జాగ్రత్తగా కొనసాగించారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని వెలికితీశారు. రాత్రి 7.30 గంటల వరకు మొత్తం 11 మందిని బయటికి తీశారు. వీరిలో అప్పటికే ఆరుగురు విగతజీవులైనట్టు గుర్తించారు.
ఇలా ఆరుగురు సజీవసమాధి అయ్యారు. గాయపడిన మరో నలుగురిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నారని భావిస్తుండడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు మరణించిన వారిలో ఇద్దరి మహిళలను గుర్తించారు. వీరిలో సుధా శ్రీధరన్ (32), చందనాబేన్ పటేల్ (50)లు ఉన్నారు. మిగిలిన నలుగురి వివరాల ఇంకా తెలియరాలేదు. మరోవైపు గాయలైనవారిలో సీతా కేసకర్ (60), రోహిణి జగతాప్ (47), అక్షయ్ కేసకర్ (18)ఉన్నారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నేలమట్టం
Published Fri, Mar 14 2014 10:10 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement