నిట్టనిలువునా కుప్పకూలింది
ముంబైలో కూలిన పాత ఐదంతస్తుల భవనం
34 మంది మృతి, 15 మందికి గాయాలు
♦ త్రుటిలో తప్పించుకున్న 50 మంది ప్లేస్కూలు చిన్నారులు
♦ ఈ భవనం ప్రమాదకరమని గతంలో నోటీసులు
సాక్షి, ముంబై: భారీవర్షాలకు అతలాకుతలమైన ముంబై నగరంలో మరో ఘోరం చోటుచేసుకుంది. వర్ష బీభత్సం నుంచి కోలుకుంటున్న ముంబైలో గురువారం ఉదయం 117 ఏళ్ల పురాతన ఐదంతస్తుల భవనం కుప్పకూలడంతో 34 మంది ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు. ముంబై దక్షిణ ప్రాంతం భెండీ బజార్‌లోని హుస్సేనీ బిల్డింగ్ ఉదయం 8.24 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాలను తొలగించేందుకు అగ్నిమాపక దళం, ఎన్‌డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగాయి.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు 10 అగ్నిమాపక బృందాలు, రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల నుంచి వెలికితీసిన వారిని చికిత్స కోసం సమీపంలోని జేజే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిని స్ట్రెచర్లపై ఇరుకైన రోడ్ల వెంబడి జేజే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సహాయక సిబ్బంది కష్టించాల్సి వచ్చింది.
గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా స్వల్పంగా గాయపడ్డారని, వారికి కూడా జేజే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రేన్లు, బుల్‌డోజర్ల సాయంతో శిథిలాలను తొలగించేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు.
దాదాపు 40 మంది నివసిస్తున్నారని అంచనా: అధికారులు
కుప్పకూలిన హుస్సేనీ భవనంలో 9 కుటుంబాలకు చెందిన 40 మంది నివసిస్తున్నారని అగ్నిమాపక విభాగ అధికారులు వెల్లడించారు. భవనం మొదట్లో మూడంతస్తులే కాగా.. 20 ఏళ్ల క్రితం అనుమతులు లేకుండా అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.
గాయపడ్డవారి వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో ఇంకా స్పష్టత లేదని డీసీపీ మనోజ్ శర్మ చెప్పారు. సహాయక చర్యలు పూర్తయ్యాక, ప్రమాద కారణాలపై విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
నోటీసులిచ్చినా ఖాళీ చేయలేదు..
ఈ భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ మహారాష్ట్ర హౌసింగ్, ఏరియా డవలప్‌మెంట్ అథారిటీ(ఎంహెచ్‌ఏడీఈ) 2011లో నోటీసులిచ్చింది. కొన్ని కుటుంబాలు ఖాళీ చేశా యి. రవాణా ఖర్చులు భరిస్తామన్నా... ఖాళీ చేసేందుకు మిగతా కుటుంబాల వారు ఒప్పుకోలేదు. భవనాన్ని ప్రమాదకరంగా ప్రకటిం చడంతో ‘ద సైఫీ బుర్హానీ పునరుద్ధరణ ట్రస్ట్, మరమ్మతులు చేపట్టింది. 2013–14లో ఏడు కుటుంబాల్ని తరలించింది.
చిన్నారులు బతికిపోయారు
దాదాపు 50 మంది చిన్నారులు ఈ ఘోర ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ భవనంలో ఒక ప్లే స్కూల్‌ను నడుస్తోంది. మరో 20 నిమిషాల్లో ఆ పాఠశాల ప్రారంభం కానుంది. అకస్మాత్తుగా ఆ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ స్కూల్ ప్రారంభం కాకముందే ఈ దుర్ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. మరో 20 నిమిషాలు ఆలస్యమైతే దారుణం చోటు చేసుకునేది. ‘మా బాబును తీసుకుని అప్పుడే స్కూల్‌కు వస్తున్నాను. నా కళ్లముందే భవనం కుప్పకూలింది. కూలడం కాస్త ఆలస్యమైతే అన్న ఆలోచనే నాకు వెన్నులో వణుకు తెప్పించింది’ అంటూ ఓ చిన్నారి తండ్రి వణికిపోయాడు.