- రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం
- ఘటనా స్థలంలోనే 10 మంది మృతి
సాక్షి,(గదగ్)బళ్లారి : గదగ్ జిల్లా గదగ్ తాలూకా హులకోటి సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా సిద్నెకొప్ప గ్రామం నుంచి ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా ఉమచగి గ్రామంలో జరిగిన ఓ శుభ కార్యక్రమానికి ట్రాక్టర్‌లో వెళ్లి వస్తున్నారు.
ఈ సందర్భంగా మార్గమధ్యలో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో 15 మందికి పైగా గాయపడటంతో వారిని గదగ్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మరో ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 12కు చేరింది. మృతుల్లో ఎనిమిది మందిని రేణుక, శాంతమ్మ, పార్వతవ్వ, మంజనాథ, దేవప్ప, సిద్ధమ్మ, శివగంగ, ఈరమ్మగా గుర్తించారు.
ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి హెచ్‌కే పాటిల్, గదగ్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని గదగ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై గదగ్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.