ఫోన్లు మర్చిపోయి వెళ్లిపోతున్నారు..
న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారిలో చాలామంది తమ మొబైల్ ఫోన్లు మరిచిపోయి వెళ్లిపోతున్నారు. కొందరు తమ సామాను మరిచిపోయి వెళ్లిపోతుంటారని, ఆ సామాన్లలో మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉంటున్నాయని సీఐఎస్‌ఎఫ్ అధికారులు చెబుతున్నారు. స్క్రీనింగ్, చెకింగ్ పాయింట్లు, వెయిటింగ్ ఏరియా, టాయిలెట్లు ఇత్యాది ప్రదేశాలలో ప్రయాణీకులు తమ సామాగ్రిని మరచిపోయి వెళ్లిపోతుంటారని వారు చెప్పారు. తాము వాటిని విమానాశ్రయ అథారిటీ వద్ద జమ చేస్తామని అధికారులు తెలిపారు.
ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో తమకు 895మొబైల్‌ఫోన్లు లభించినట్లు వారు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుంచి మే వరకు ప్రయాణీకులు వదిలి వెళ్లిన సామాగ్రి విలువ మొత్తం రెండు కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. వాటిలో దాదాపు 91 లక్షల రూపాలయ విలువైన సామాగ్రిని ప్రయాణీకులకు తిరిగి అప్పగించారు. మిగతా సామాగ్రి ఇంకా విమానాశ్రయం స్టోర్ రూములలో పడి ఉంది. ప్రయాణీకులు ఎక్కువగా మొబైల్ ఫోను మరిచిపోయి వెళ్తుంటారని, ఈ సంవత్సరం మే వరకు తమకు దొరికిన 895 మొబైల్ ఫోన్లలో 317 మొబైల్ ఫోన్లను మాత్రమే ప్రయాణీకులకు తిరిగి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
గత సంవత్సరం సీఐఎస్‌ఎఫ్ అధికారులకు 2148 మొబైల్ ఫోన్లు లభించాయి. వాటిలో 734 ఫోన్లను యజమానులకు తిరిగి అప్పగించారు. మిగతా 1414 ఫోన్లు ఎయిర్‌పోర్టు అథారిటీ వద్ద జమచేశారు. ప్రయాణీకులు వదిలే వెళ్లే సామాగ్రిలో మొబైల్ ఫోన్లతో పాటు లాప్‌టాప్ , కెమెరా, రిస్ట్ వాచ్ జ్యుయలరీ వంటి వస్తువులు ఉంటున్నాయి. పాస్‌పోర్టు, పాన్‌కార్డు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా ప్రయాణీకులు మరిచిపోయి వెళ్తుంటారు. సామాను మరిచి వెళ్లిన ప్రయాణీకులు తమ వద్దకు వచ్చి వాటి వివరాలు తెలిపి తీసుకెళ్తుంటారని, అయితే అలాంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.