జల్లికట్టు పోటీలకు 24 నిబంధనలు
కేకేనగర్: జల్లికట్టు పోటీ జరపడానికి అనుకూలంగా తమిళనాడు జంతు హింస నిరోధక చట్టంలో సవరణలు చేసి రాష్ట్ర గవర్నర్ అంగీకారంతో కూడిన అత్యవసర చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1960లో తీసుకు వచ్చిన చట్టం 59లో సబ్‌సెక్షన్ –2లో సవరణ చేయడానికి ప్రభుత్వ ఆదేశం మేరకు పశు సంవర్థక శాఖ ప్రభుత్వ కార్యదర్శి కగన్ దీప్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. జల్లికట్టు పోటీ జరిగే సమయంలో అనుసరించాల్సిన నిబంధనల ప్రకటనను విడుదల చేశారు.
ప్రైవేటు సంస్థల కమిటీల తరఫున జల్లికట్టు జరిపేందుకు ముందు కలెక్టర్‌కు రాతపూర్వకంగా సమాచారం తెలియజేయాలి. జల్లికట్టు పోటీల్లో పాల్గోనే వ్యక్తులు, ఎద్దుల వివరాలను ముందస్తుగా కలెక్టర్ వద్ద నమోదు చేసి నిర్ధారించుకోవాలి. జల్లికట్టు జరిపే స్థలాన్ని కలెక్టర్ నేరుగా వెళ్లి పరిశీలనలు జరిపి అనుమతి ఇవ్వాలి.
► జల్లికట్టు పోటీలో పాల్గొనడానికి తీసుకు వచ్చిన ఎద్దులకు మత్తుమందు ఇచ్చారా, చిత్రవధ చేశారా అనే విషయాలపై వెటర్నరీ వైద్యులు పరీక్షలు జరపాలి
► పోటీలలో పాల్గోనే ఎద్దులు ఆరోగ్యంగా ఉన్నాయని వైద్యుల సమాచారం మేరకు కలెక్టర్ అనుమతి ఇవ్వాలి
► ఎద్దులు ఉన్న స్థలాన్ని సీసీ కెమెరా ద్వారా పరిశీలించాలి. జల్లికట్టు జరిగే పోటీ దృశ్యాలను సీసీ టీవీ కెమెరాల్లో నమోదు చేయాలి
► ఎద్దులకు నీరసంగా, ఉద్వేగంగా ఉన్న పక్షంలో పోటీకి వాటిని అనుమతించరాదు
► ఎద్దులకు సారాయి వంటి మత్తుపదార్థాలను ఇచ్చారా అని పరిశీలించి జల్లికట్టు జరిగే పోటీకి అనుమతించరాదు
► పోటీ జరిగే ప్రాంతానికి వచ్చే ముందు ఎద్దు ముక్కుకు ఉన్న తాడు తీసివేయాలి
► మైదానం 50 చదరపు మీటర్లు ఉండాలి. అందులోనే పోటీ దారులు ఎద్దులను పట్టుకోవాలి
► పోటీ జరిగే మైదానంలో ఎద్దు వచ్చినప్పుడు దానికి అడ్డుగా నిలబడకూడదు
► మైదానం లోపల ఎద్దు వచ్చే 10 మీటర్లు, 30 నిమిషాలు, మూడు సార్లు అది దూకినప్పడు దాన్ని పట్టుకోవాలి. ఎద్దును అదుపు చేసే సమయంలో దాని తోకను కొమ్ములను పట్టుకోరాదు. ఎద్దు పరిగెత్తకుండా ఉండే విధంగా దాన్ని అడ్డుకోరాదు
► ఎద్దుకు గాని, పోటీ దారునికిగాని దెబ్బలు తగలకుండా ఉండేందుకు మైదానంలో 15 మీటర్లు వరకు కొబ్బరి పీచును పరచాలి
► మైదానం లోపలికి వచ్చే ఎద్దు 15 మీటర్లు దాటి వెళ్లిన తరువాత పోటీదారులు ఎద్దును వంద మీటర్లు వరకు ఎలాంటి అడ్డంకులు ఉంచరాదు.
► జల్లికట్టు పోటీకి యజమానులే ఎద్దులను తీసుకురావాలి
► పోటీ ముగిసిన ఎద్దుకు 20 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. ఆ తరువాత ఎద్దు యజమానులు ఎద్దును తీసుకువెళ్లాలి.
► పోటీ మైదానంలో ఇరువైపులా అడ్డును ఏర్పాటు చేసి 8 అడుగుల ఎత్తుకు అనగా ఎద్దులు దాటని విధంగా ప్రేక్షకులకు కుర్చీలను ఏర్పాటు చేశారా లేదా అనే విషయాన్ని కలెక్టర్ నిర్ధారణ చేయాలి.
► మైదానంలో ప్రేక్షకులు ఎంతమంది కూర్చోవచ్చు అనే దాని గురించి ప్రజాపనుల శాఖ అధికారుల వద్ద నుంచి సర్టిఫికెట్ పొందాలి వంటి 24 నిబంధనలు అందులో ఉన్నాయి.