సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు బుధవారం జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్ల నిరుత్సాహం ప్రస్ఫుటంగా కనిపించింది. ఆరేడు నెలల సంబరానికి ఎందుకులే...అనుకున్నారా, ఏమో పోలింగ్ బూత్‌లన్నీ వెలవెలబోయాయి. బెంగళూరు లోక్‌సభ నియోజక వర్గంలోని రాజరాజేశ్వరి నగర అసెంబ్లీ సెగ్మెంట్‌లో మరీ ఘోరం. పోలింగ్ మరో గంటలో ముగుస్తుందనగా 25 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు. మండ్య కాస్త మెరుగనిపించింది. బెంగళూరు గ్రామీణలో 46, మండ్యలో 50.93 శాతం ఓట్లు పోలయ్యాయి.
పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ కాస్త ఎక్కువగా నమోదైంది. కాగా పోలింగ్ బహిష్కరణ, ఓటింగ్ యంత్రాల్లో లోపాలు తదితర చెదురుమదురు సంఘటనలు మినహా సాయంత్రం ఐదున్నర గంటలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జేడీఎస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి, మాజీ మంత్రి చలువరాయ స్వామిలు శాసనసభకు ఎన్నికవడంతో లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు జరిగాయి. బెంగళూరు గ్రామీణలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి డీకే. శివకుమార్ తమ్ముడు సురేశ్ పోటీ చేస్తుండగా, జేడీఎస్ తరఫున కుమారస్వామి సతీమణి అనిత తలపడుతున్నారు. మండ్యలో కాంగ్రెస్ అభ్యర్థిగా నటి రమ్య, జేడీఎస్ అభ్యర్థి సీఎస్. పుట్టరాజు పోటీ చేస్తున్నారు.
ఓటు వేసిన ప్రముఖులు..
డీకే. శివకుమార్ కనకపుర తాలూకా దొడ్డఆలనహళ్లిలో సతీ సమేతంగా ఓటు వేశారు. జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి బిడది సమీపంలోని కేతగానహళ్లి పోలింగ్ కేంద్రంలో భర్త కుమారస్వామితో కలసి ఓటు వేశారు. మండ్యలో జేడీఎస్ అభ్యర్థి పుట్టరాజు తన స్వగ్రామం చినకురులిలో ఓటు వేయడానికి ముందు ఈవీఎంకు పూజ చేయడానికి ప్రయత్నించగా, అధికారులు సమ్మతించలేదు. దీంతో ఆయన ఈవీఎంకు దండం పెట్టి ఓటు వేశారు. మండ్య లోక్‌సభ నియోజక వర్గంలోని మద్దూరు తాలూకా సోమనహళ్లి పోలింగ్ కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం. కృష్ణ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి, నటుడు అంబరీశ్ తన స్వగ్రామం దొడ్డఅరసినకెరెలో ఓటు వేశారు.
బెంగళూరు గ్రామీణలో
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోలింగ్ శాతం
బెంగళూరు దక్షిణ - 27
కనకపుర- 63
రామనగర - 66
మాగడి - 60.05
ఆనేకల్ - 40
రాజరాజేశ్వరి నగర - 32.05
కుణిగల్ - 63.39
చన్నపట్టణ - 56
ఓటు వెలవెల
Published Thu, Aug 22 2013 3:13 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
Advertisement
Advertisement