ఎమ్మెల్యేగారి భార్య భవనం కూల్చివేతకు రంగం సిద్ధం
టీనగర్: చెన్నైలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కేంద్ర మాజీ మంత్రి టీఆర్‌బాలు కోడలు భవనాన్ని కూల్చివేసేందుకు సీఎండీకే అధికారులు నిర్ణయించారు. కేంద్ర మాజీ మంత్రి టీఆర్ బాలు కోడలు షర్మిలరాజ. ఈమె చెన్నై త్యాగరాయ నగర్, బజుల్లా రోడ్డు డోర్ నెం. 103 అనే చిరునామాలో గ్రౌండ్ ఫ్లోర్‌తో కూడిన రెండు అంతస్తుల కార్యాలయాన్ని, నివాస గృహాన్ని నిర్మించేందుకు 2011 నవంబర్‌లో చెన్నై కార్పొరేషన్‌లో ప్లానింగ్ అనుమతి కోరారు.
అయితే ప్లానింగ్ అనుమతికి విరుద్దంగా నిర్ణీత స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించడమే కాకుండా అనేక నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసింది. దీని గురించి వివరణ కోరుతూ 2013 ఏప్రిల్ 23వ తేదీ సీఎండీఏ ఒక నోటీసు పంపింది. దీంతో మే 9వ తేదీ భవనానికి రీ ప్లాన్ ఇవ్వాలని యజమాని కోరారు. దీన్ని నిరాకరించిన సీఎండీకే అధికారులు 2013 అక్టోబర్ 4వతేదీ భవనానికి సీల్ వేశారు. దీంతో షర్మిల రాజ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ లేఖపై గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది.
నిబంధనలను సవరించేందుకు అనుమతించాలని గృహ నిర్మాణ శాఖ సీఎండీఏ అభిప్రాయాన్ని కోరింది. ఇందుకు సీఎండీఏ యజమాన్యం ఇటీవల ఇచ్చిన వివరణలో భవనంలో ఉల్లంఘించిన నిబంధనలను సరిచేసేందుకు సాధ్యం కాదని అందువల్ల భవన యజమాని కోర్కెను నిరాకరిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆ భవనాన్ని ఏ సమయంలోనైనా కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది. షర్మిలరాజ భర్త టీఆర్ బాలు కుమారుడైన టీఆర్ రాజ మన్నార్‌గుడి అసెంబ్లీ సభ్యుడు కావడం గమనార్హం.