ముంబయి: ముంబయిలోని జుహీ బీచ్ సముద్ర తీరానికి గత రాత్రి భారీ తిమింగలం (వేల్) కొట్టుకు వచ్చింది. 30 అడుగుల పొడవు మూడు నుంచి నాలుగు టన్నుల బరువుగల ఈ తిమింగలాన్ని గురువారం రాత్రి పది గంటలకు ఒడ్డుకు కొట్టుకుని రావటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే రెండు రోజుల క్రితమే ఆ తిమింగలం చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. అది చనిపోవడం వల్లే తీరానికి కొట్టుకొచ్చిందని, సముద్రంలోని వాతావరణ మార్పుల వల్ల తిమింగలాలు ఊపిరి ఆడక ఒడ్డుకు కొట్టుకునివస్తాయని మెరైన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీంతో క్రేన్ ద్వారా ఆ తిమింగలాన్ని అక్కడ నుంచి తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది కూడా అతి పెద్ద తిమింగలం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లా లోని అలీబాగ్ సమీపంలో... 20 టన్నుల బరువు 42 అడుగుల పొడవు ఉన్న నీలి తిమింగలం కొట్టుకు వచ్చింది. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మర్నాడే అది చనిపోవడంతో జేసీబీ యంత్రాల సాయంతో సముద్రం ఒడ్డునే పాతి పెట్టారు. ఇటీవలే తమిళనాడు రాష్ట్రం టుటికోరిన్ బీచ్ వద్ద దాదాపు వంద తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 2000కు పైగా తిమింగలాలు సముద్ర తీరానికి కొట్టుకొస్తాయని, 1800 నుంచి 2015 వరకు ఏటా భారత సముద్ర తీరానికి 1500కు పైగా తిమింగలాలు కొట్టుకొచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జుహూ బీచ్ కి అతి పెద్ద తిమింగలం
Published Fri, Jan 29 2016 9:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM
Advertisement