పాండియన్
సాక్షి, చెన్నై: సొంతూరిపై ప్రేమ అతడిని సైకిలెక్కించింది. అయినవారిపై ఆపేక్ష 600 కిలోమీటర్లను సునాయాసంగా అధిగమించేలా చేసింది. 73 ఏళ్ల వృద్ధాప్యంలో అతడిలో యువరక్తం ఉరకలేసేలా చేసింది. సాహసం సేయరా డింభకా అనే ప్రసిద్ధ తెలుగు సినీడైలాగ్‌ను ఆ వృద్ధుడు సార్థకం చేశాడు. వివరాలు.. తిరునెల్వేలి జిల్లా నాంగునేరి సమీపం దైవనాయగిపేరికి చెందిన పాండియన్ (73) అప్పటి పీయూసీ చదువుకున్నాడు. గత 40 ఏళ్లుగా చెన్నైలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. అప్పుడప్పుడూ సొంతూరికి వెళ్లిరావడం పాండియన్‌కు అలవాటు. ప్రస్తుతం చెన్నైలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో సైకిల్‌పై చెన్నై నుంచి బయలుదేరి సొంతూరుకు చేరుకున్నాడు. ఇరుగుపొరుగు వారు ఈ సాహస వృద్ధుడిని పలుకరించగా, గత నెల 25వ తేదీన సైకిల్‌పై చెన్నైలో బయలుదేరి ఐదు రోజులపాటు ప్రయాణించానని తెలిపాడు. పగటి పూట మాత్రమే ప్రయాణిస్తూ రాత్రివేళల్లో రోడ్డువారగా నిద్రపోయేవాడినని చెప్పాడు.
మార్గమధ్యంలో రోడ్లపై అందుబాటులో ఉండే తినుబండాలతో ఆకలితీర్చుకున్నానని తెలిపాడు. 29వ తేదీ నాటికి దైవనాయగిపేరిలోని తన అన్న ఇంటికి చేరుకున్నట్లు చెప్పాడు. 600 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎవ్వరూ నన్ను అడ్డగించలేదు, ఏమని అడగలేదని అన్నాడు. సొంతూరు సరిహద్దుల్లోని చెక్‌పోస్టు వారు కూడా అడ్డుకోలేదని తెలిపాడు. సొంతూరుకు చేరుకున్న తరువాత 15 రోజుల హోం ఐసోలేషన్ విధించుకుని కబసుర కషాయం తాగుతూ కరోనా వైరస్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానని అన్నాడు. ఎలాంటి అనారోగ్యం లేదు, హాయిగా ఉన్నానని తెలిపాడు. నా భార్య, పిల్లలు చెన్నైలోనే ఉన్నారు. సొంతూరి ప్రజలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. బాల్యదశలో చదువుకుంటూ పొలం పనులు చేయడం అలవాటు. ఆ అలవాటే నా ఆరోగ్య రహస్యం. అందుకే సైకిల్ ప్రయాణంతో ఐదు రోజుల్లో సొంతూరికి చేరుకోగలిగాను. మరికొన్ని రోజులు ఇక్కడే ఉండి చెన్నైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. 73 ఏళ్ల వయసులో 600 కిలోమీటర్ల దూరాన్ని ఐదు రోజుల్లో అధిగమించి గమ్యస్థానానికి చేరుకున్న పాండియన్ ఆ ఊరి ప్రజల హృదయాల్లో ఒక సెలబ్రటీలా నిలిచిపోయాడు. (లారీ చోరీ చేసి..కరోనా పరీక్షకు)
Comments
Please login to add a commentAdd a comment