సాక్షి, ముంబై : ముందుగా తమ మొబైల్ ఫోన్ ద్వారా టికెట్ బుక్ చేసుకొని ఆ తరువాత స్టేషన్‌లో దాని ప్రింట్ తీసుకునే మొబైల్ టికెటింగ్ సదుపాయాన్ని మరో ఎనిమిది సబర్బన్ రైల్వే స్టేషన్లలో ప్రారంభించారు. హార్బర్‌లైన్‌లోని వాషి, మెయిన్‌లైన్‌లోని ఠాణే, కల్యాణ్, సీఎస్టీ, వెస్టర్న్ లైన్‌లోని బోరివలి, అంధేరి, ముంబై సెంట్రల్, చర్చ్‌గేట్‌లలో ప్రయాణికుల కోసం ఈ మొబైల్ ఫోన్ టికెటింగ్ వెసలుబాటు కల్పించారు.
ఈ మొబైల్ టికెటింగ్ విధానాన్ని ఇటీవల రైల్వే మంత్రి సురేష్ ప్రభు దాదర్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని ఇప్పటివరకు దాదాపు 1,500 మంది వినియోగదారులు ఉపయోగించి వంద టికెట్‌లను బుక్ చేసుకున్నారు. అయితే ఆన్‌లైన్ రీచార్జ్ కోసం ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం రీచార్జ్ చేసుకునే వ్యవస్థ కేవలం టికెట్ విండో వద్దనే ఉంది. అయితే కొంత మంది ప్రయాణికులు ‘జర్నీ ఎక్స్‌టెన్షన్’ టికెట్ వ్యవస్థ కూడా కలిగి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారని ఓ అధికారి తెలిపారు. సగటును రూ.100 వరకు మొబైల్ టికెటింగ్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. తాము రూ.20 నుంచి రూ.50 వరకు కూడా రీచార్జ్ చేసుకునే సౌకర్యం ఉంటే బాగుంటుందని బాంద్రా-చర్చ్‌గేట్ మధ్య ప్రయాణించే వారు అభిప్రాయపడ్డారు.
మరో ఐదేళ్లలో రైల్వే శాఖ ‘పేపర్‌లెస్’ వ్యవస్థగా మారిపోతుందని రైల్వే మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో ప్రకటించిందని ముంబై ట్రాన్స్‌పోర్ట్ ఫోరమ్‌కు చెందిన విజయ్‌శ్రీ పెడ్నేకర్ తెలిపారు. కానీ ప్రస్తుతం ప్రవేశపెట్టిన కొత్త వ్యవస్థలో టికెట్ బుక్ చేయడం కోసం మొదట మొబైల్ యాప్‌ను ఉపయోగించి తర్వాత టికెట్ ప్రింట్ కోసం ఏటీవీఎంల వద్ద క్యూలో నిల్చోవాల్సి వస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఇది ప్రారంభ దశ మాత్రమేనన్నారు. రెండవ దశలో టికెట్ ప్రింట్ తీసుకునే అవసరం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మొబైల్‌లోనే టికెట్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మరో ఎనిమిది స్టేషన్లలో మొబైల్ టికెటింగ్
Published Sat, Jan 3 2015 10:08 PM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM
Advertisement
Advertisement