Mobile ticketing
-
ఆర్టీసీ ఇక ‘ఛలో’
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలో త్వరలో మొబైల్ టిక్కెటింగ్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫోన్ నుంచే నేరుగా బస్సులోనే టిక్కెట్ కొనుక్కునే సదుపాయాన్ని ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తోంది. ఇందుకు ‘ఛలో’ అనే ప్రజా రవాణా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుని ‘ఛలో’ యాప్, ‘ఛలో’ కార్డులను ప్రవేశపెట్టింది. బుధవారం విజయవాడలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్, ఛలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వినాయక్ ‘ఛలో’ యాప్‌ను ఆవిష్కరించారు. తొలి దశలో మొబైల్ టిక్కెటింగ్, ‘ఛలో’ కార్డులను విజయవాడ సిటీ బస్సుల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో ఆన్లైన్ రిజర్వేషన్, ఈ–వాలెట్, నగదు రహిత లావాదేవీలు, వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమలవుతున్నాయి. వీటితోపాటు మొబైల్ టిక్కెటింగ్‌కు అన్ని సౌకర్యాలున్న ఎలక్ట్రానిక్ టిమ్స్‌లను వినియోగించనున్నారు. వీటి కొనుగోలుకు, డిపోల్లో కంప్యూటర్లు అమర్చడానికి, ఇంటర్నెట్కు ఆర్టీసీ పైసా ఖర్చు చేయడం లేదు. ‘ఛలో’ కంపెనీ తమ సామర్థ్యం నిరూపించుకునేందుకు ఉచితంగా ఈ సేవలను ఆర్టీసీకి అందించనుంది. మూడు నెలలు ఉచితంగా స్మార్ట్ కార్డులు ఛలో ట్రావెల్ ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డును మొదటి మూడు నెలలు ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు కంపెనీ నిర్ణయించింది. ఆ తర్వాత తమ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ చేసుకోవాలి. అన్ని రీఛార్జ్‌లపై 5 శాతం ప్రారంభోత్సవ బోనస్ లభిస్తుంది. ఈ స్మార్ట్ కార్డుతో ఒక రోజు బస్ పాస్‌ను కూడా పొందొచ్చు. ఈ పాస్‌తో విజయవాడ సిటీ బస్సుల్లో అపరిమితంగా పర్యటించేందుకు వీలు కల్పించారు. అంతేకాకుండా ప్రయాణికుడు కండక్టర్‌కు ఈ కార్డును చూపిస్తే.. కార్డును ఎలక్ట్రానిక్ టిమ్‌కు ట్యాప్ చేసి టిక్కెట్ ఇస్తారు. కాగా, ఈ స్మార్ట్ కార్డులను త్వరలో అందుబాటులోకి తెస్తామని ‘ఛలో’ కంపెనీ వెల్లడించింది. యాప్ ప్రారంభిస్తున్న ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్, ఛలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వినాయక్ యాప్‌తో మొబైల్ టిక్కెట్లు కొనుక్కునే సదుపాయం ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఛలో యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా సిటీ బస్సుల్లో ఎక్కడ్నుంచి ఎక్కడకు ప్రయాణించాలో.. నమోదు చేసుకుని డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బస్సును లైవ్ ట్రాక్ చేయొచ్చు. ఈ యాప్‌తో బస్టాప్‌ల చిరునామాలు, అన్ని ప్రయాణ మార్గాల ఛార్జీలను తెలుసుకోవచ్చు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకే ప్రయోగాత్మకంగా విజయవాడలో ఛలో యాప్, కార్డును ప్రవేశపెట్టాం. యాప్.. విజయవాడలో 500 సిటీ బస్సుల్లో 2.5 లక్షల మంది రోజువారీ ప్రయాణికులకు సేవలందించనుంది. ఆర్టీసీ.. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో ముందు ఉంటుంది. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు మొత్తం వెయ్యి బస్సులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించాం. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినందున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి విశాఖకు కనెక్టివిటీ పెంచే విధంగా 22 వోల్వో బస్సులను కొనుగోలు చేస్తున్నాం. వీటికి డాల్ఫిన్ క్రూయిజ్‌లుగా నామకరణం చేస్తాం. – మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ ఎండీ -
మరో ఎనిమిది స్టేషన్లలో మొబైల్ టికెటింగ్
సాక్షి, ముంబై : ముందుగా తమ మొబైల్ ఫోన్ ద్వారా టికెట్ బుక్ చేసుకొని ఆ తరువాత స్టేషన్లో దాని ప్రింట్ తీసుకునే మొబైల్ టికెటింగ్ సదుపాయాన్ని మరో ఎనిమిది సబర్బన్ రైల్వే స్టేషన్లలో ప్రారంభించారు. హార్బర్లైన్లోని వాషి, మెయిన్‌లైన్‌లోని ఠాణే, కల్యాణ్, సీఎస్టీ, వెస్టర్న్ లైన్‌లోని బోరివలి, అంధేరి, ముంబై సెంట్రల్, చర్చ్గేట్లలో ప్రయాణికుల కోసం ఈ మొబైల్ ఫోన్ టికెటింగ్ వెసలుబాటు కల్పించారు. ఈ మొబైల్ టికెటింగ్ విధానాన్ని ఇటీవల రైల్వే మంత్రి సురేష్ ప్రభు దాదర్ రైల్వే స్టేషన్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని ఇప్పటివరకు దాదాపు 1,500 మంది వినియోగదారులు ఉపయోగించి వంద టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే ఆన్లైన్ రీచార్జ్ కోసం ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రీచార్జ్ చేసుకునే వ్యవస్థ కేవలం టికెట్ విండో వద్దనే ఉంది. అయితే కొంత మంది ప్రయాణికులు ‘జర్నీ ఎక్స్టెన్షన్’ టికెట్ వ్యవస్థ కూడా కలిగి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారని ఓ అధికారి తెలిపారు. సగటును రూ.100 వరకు మొబైల్ టికెటింగ్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. తాము రూ.20 నుంచి రూ.50 వరకు కూడా రీచార్జ్ చేసుకునే సౌకర్యం ఉంటే బాగుంటుందని బాంద్రా-చర్చ్‌గేట్ మధ్య ప్రయాణించే వారు అభిప్రాయపడ్డారు. మరో ఐదేళ్లలో రైల్వే శాఖ ‘పేపర్‌లెస్’ వ్యవస్థగా మారిపోతుందని రైల్వే మంత్రిత్వ శాఖ బడ్జెట్లో ప్రకటించిందని ముంబై ట్రాన్స్పోర్ట్ ఫోరమ్‌కు చెందిన విజయ్శ్రీ పెడ్నేకర్ తెలిపారు. కానీ ప్రస్తుతం ప్రవేశపెట్టిన కొత్త వ్యవస్థలో టికెట్ బుక్ చేయడం కోసం మొదట మొబైల్ యాప్‌ను ఉపయోగించి తర్వాత టికెట్ ప్రింట్ కోసం ఏటీవీఎంల వద్ద క్యూలో నిల్చోవాల్సి వస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఇది ప్రారంభ దశ మాత్రమేనన్నారు. రెండవ దశలో టికెట్ ప్రింట్ తీసుకునే అవసరం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మొబైల్లోనే టికెట్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
మొబైల్ టికెటింగ్‌తో సమయం ఆదా
రైల్వే మంత్రి సురేష్ ప్రభు సాక్షి, ముంబై: మొబైల్ టికెటింగ్ విధానంతో లోకల్ రైళ్లలో ప్రయాణించేవారికి సమయం చాలా ఆదా అవుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దాదర్ రైల్వే స్టేషన్లో శనివారం లోకల్ ‘మొబైల్ టికెటింగ్’ విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ ముంబైలోని లోకల్ రైళ్లను ప్రతిరోజూ కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారన్నారు. కాగా, వీరు గంటల తరబడి క్యూలో నిలబడే అవసరం లేకుండా సులభంగా టికెటు పొందేందుకు ఈ మొబైల్ టికెటింగ్ విధానం ఉపయోగపడుతుందన్నారు. త్వరలోనే సీఎస్టీ, కుర్లా, ఠాణే, కల్యాణ్ తదతర కీలక స్టేషన్లలో ఈ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్, విండోస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించేవారు డౌన్ లోడ్ చేసుకునే అవకాశముంటుందని చెప్పారు. వినియోగదారుడు తొలుత అప్లికేషన్‌ను ఓపెన్ చేసి పేరు, మొబైల్ నంబర్, ముంబై సిటీ నమోదుచేసిన తర్వాత ఎస్సెమ్మెస్ ద్వారా అతనికి ఒక పాస్ వర్డ్ వస్తుందన్నారు. అప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వినియోగదారుడి పేరు నమోదు అవుతుందని చెప్పారు. అనంరతం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం, ఫస్ట్, సెకండ్ క్లాస్ తదితర వివరాలు అందులో కనిపిస్తాయని, ఆ ప్రకారం నమోదు చేయడం పూర్తయితే మనం టికెటు పొందినట్లు మెసేజ్ వస్తుందన్నారు. దానిమేరకు మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చని ఆయన వివరించారు. జీరో బ్యాలన్స్తో మన పేరు రిజస్టర్ అయినప్పటికీ టికెటు పొందాలంటే అందులో రూ.100 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ బ్యాలెన్స్‌ను భర్తీ చేసుకునేందుకు ప్రస్తుతం దాదర్‌లో మాత్రమే సౌకర్యం కల్పించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ముంబై జిల్లా ఇన్చార్జి మంత్రి సుభాష్ దేశాయ్, మేయర్ స్నేహల్ అంబేకర్, ఎంపీలు రాహుల్ శేవాలే, అనిల్ దేశాయ్, సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్‌కుమార్, పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.కె.టండన్, రైల్వే బోర్డు సభ్యుడు సంజయ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.