
సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీలో త్వరలో మొబైల్ టిక్కెటింగ్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫోన్ నుంచే నేరుగా బస్సులోనే టిక్కెట్ కొనుక్కునే సదుపాయాన్ని ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తోంది. ఇందుకు ‘ఛలో’ అనే ప్రజా రవాణా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుని ‘ఛలో’ యాప్, ‘ఛలో’ కార్డులను ప్రవేశపెట్టింది. బుధవారం విజయవాడలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్, ఛలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వినాయక్ ‘ఛలో’ యాప్‌ను ఆవిష్కరించారు. తొలి దశలో మొబైల్ టిక్కెటింగ్, ‘ఛలో’ కార్డులను విజయవాడ సిటీ బస్సుల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో ఆన్‌లైన్ రిజర్వేషన్, ఈ–వాలెట్, నగదు రహిత లావాదేవీలు, వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమలవుతున్నాయి. వీటితోపాటు మొబైల్ టిక్కెటింగ్‌కు అన్ని సౌకర్యాలున్న ఎలక్ట్రానిక్ టిమ్స్‌లను వినియోగించనున్నారు. వీటి కొనుగోలుకు, డిపోల్లో కంప్యూటర్లు అమర్చడానికి, ఇంటర్నెట్‌కు ఆర్టీసీ పైసా ఖర్చు చేయడం లేదు. ‘ఛలో’ కంపెనీ తమ సామర్థ్యం నిరూపించుకునేందుకు ఉచితంగా ఈ సేవలను ఆర్టీసీకి అందించనుంది.
మూడు నెలలు ఉచితంగా స్మార్ట్ కార్డులు
ఛలో ట్రావెల్ ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డును మొదటి మూడు నెలలు ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు కంపెనీ నిర్ణయించింది. ఆ తర్వాత తమ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ చేసుకోవాలి. అన్ని రీఛార్జ్‌లపై 5 శాతం ప్రారంభోత్సవ బోనస్ లభిస్తుంది. ఈ స్మార్ట్ కార్డుతో ఒక రోజు బస్ పాస్‌ను కూడా పొందొచ్చు. ఈ పాస్‌తో విజయవాడ సిటీ బస్సుల్లో అపరిమితంగా పర్యటించేందుకు వీలు కల్పించారు. అంతేకాకుండా ప్రయాణికుడు కండక్టర్‌కు ఈ కార్డును చూపిస్తే.. కార్డును ఎలక్ట్రానిక్ టిమ్‌కు ట్యాప్ చేసి టిక్కెట్ ఇస్తారు. కాగా, ఈ స్మార్ట్ కార్డులను త్వరలో అందుబాటులోకి తెస్తామని ‘ఛలో’ కంపెనీ వెల్లడించింది.
యాప్ ప్రారంభిస్తున్న ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్, ఛలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వినాయక్
యాప్‌తో మొబైల్ టిక్కెట్లు కొనుక్కునే సదుపాయం
ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఛలో యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా సిటీ బస్సుల్లో ఎక్కడ్నుంచి ఎక్కడకు ప్రయాణించాలో.. నమోదు చేసుకుని డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బస్సును లైవ్ ట్రాక్ చేయొచ్చు. ఈ యాప్‌తో బస్టాప్‌ల చిరునామాలు, అన్ని ప్రయాణ మార్గాల ఛార్జీలను తెలుసుకోవచ్చు.
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకే
ప్రయోగాత్మకంగా విజయవాడలో ఛలో యాప్, కార్డును ప్రవేశపెట్టాం. యాప్.. విజయవాడలో 500 సిటీ బస్సుల్లో 2.5 లక్షల మంది రోజువారీ ప్రయాణికులకు సేవలందించనుంది. ఆర్టీసీ.. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో ముందు ఉంటుంది. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు మొత్తం వెయ్యి బస్సులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించాం. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినందున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి విశాఖకు కనెక్టివిటీ పెంచే విధంగా 22 వోల్వో బస్సులను కొనుగోలు చేస్తున్నాం. వీటికి డాల్ఫిన్ క్రూయిజ్‌లుగా నామకరణం చేస్తాం.
– మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment