చర్చకు పట్టు.. ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో 11 మంది ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని సమర్పించగా.. కేజీ టు పీజీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్, విద్యారంగ సంస్ధలపై టీటీడీపీ, బీజేపీలు వాయిదా తీర్మానాన్ని సమర్పించాయి. ప్రశ్నోత్తరాలు నిర్వహించకముందే వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి.
దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మందిని, టీటీడీపీకు చెందిన ఇద్దరు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ కు చెందిన డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, వంశీచందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, గీతా రెడ్డి, ఎన్.పద్మావతి, సంపత్ కుమార్ లు, టీటీడీపీకి చెందిన రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు ఉన్నారు.