‘ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాం’
‘ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాం’
Published Sat, Dec 17 2016 12:33 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను తమకు అనుకూలంగా నడుపుకోవాలని హరీష్ రావు చూస్తున్నారని కాంగ్రెస్ నేత డీకే అరుణ విమర్శించారు. 9 మంది కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడంపై ఆమె మండిపడ్డారు. ప్రజా సమస్యలపై వాయిదా తీర్మానాలు ఇస్తూనే ఉంటామన్నారు. సభ్యులను సస్పెండ్ చేస్తే ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. అవసరమైతే టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామన్నారు.
కాగా తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో 11 మంది ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని సమర్పించగా.. కేజీ టు పీజీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్, విద్యారంగ సంస్ధలపై టీటీడీపీ, బీజేపీలు వాయిదా తీర్మానాన్ని సమర్పించాయి. ప్రశ్నోత్తరాలు నిర్వహించకముందే వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి.
దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మందిని, టీటీడీపీకు చెందిన ఇద్దరు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ కు చెందిన డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, వంశీచందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, గీతా రెడ్డి, ఎన్.పద్మావతి, సంపత్ కుమార్ లు, టీటీడీపీకి చెందిన రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు ఉన్నారు.
Advertisement