రాష్ర్టంలో కోటీశ్వర అభ్యర్థుల జాబితాలో ఏసీ షణ్ముగం అగ్ర స్థానానికి చేరారు. బీజేపీ అధిష్టానం వద్ద పట్టు బట్టి మరీ వేలూరు సీటు దక్కించుకున్న పుదియ తమిళగం అధినేత ఏసీ షణ్ముగం
కోటీశ్వరుడు
Apr 5 2014 11:41 PM | Updated on Sep 2 2017 5:37 AM
సాక్షి, చెన్నై:రాష్ర్టంలో కోటీశ్వర అభ్యర్థుల జాబితాలో ఏసీ షణ్ముగం అగ్ర స్థానానికి చేరారు. బీజేపీ అధిష్టానం వద్ద పట్టు బట్టి మరీ వేలూరు సీటు దక్కించుకున్న పుదియ తమిళగం అధినేత ఏసీ షణ్ముగం తన ఆస్తులు రూ.106 కోట్లుగా ప్రకటించారు. నామినేషన్ పత్రంలో వివరాల్ని పొందుపరిచారు. రాష్ర్టంలో బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. బీజేపీ 8 స్థానాల బరిలో అభ్యర్థులను నిలబెట్టేందుకు నిర్ణయించింది. ఆరు స్థానాలకు ముందుగానే ప్రకటించినా, రెండు స్థానాల్ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఇందులో వేలూరు స్థానం ఒకటి.
తనకు బీజేపీ తరపున సీటు ఇవ్వాలంటూ పుదియ తమిళగం పార్టీ అధినేత ఏసీ షణ్ముగం కమలనాథులకు విన్నవించారు. ఈ గట్టి పోటీ పెరగడంతో ఎట్టకేలకు తన ఆర్థిక బలంతో ఏసీ షణ్ముగం సీటు దక్కించుకున్నారు. వేలూరు సీటు దక్కించుకున్న ఏసీ షణ్ముగం గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. విద్యా సంస్థల అధినేతగా ఉన్న ఆయన ఒకప్పుడు అన్నాడీఎంకేలో యువజన నాయకుడు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక కొత్తగా పుదియ నిధి కట్చి ఏర్పాటు చేసుకున్నారు. సొంతంగా పార్టీని నడిపిస్తున్నప్పటికీ, బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగాలన్న ఆశతో వేలూరు సీటు కోసం యత్నించి సఫలీకృతుడయ్యారు.ఎన్నికల బరిలో దిగిన షణ్ముగం తన నామినేషన్‌ను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
ఇందులో ఆయన పేర్కొన్న గణాంకా లు ఎన్నికల అధికారుల్ని విస్మయంలో పడేశాయి. తన, తన భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాల్ని అందులో ప్రకటించారు. రూ.22. 87 లక్షల నగదు తన పేరిట, రూ.7.12 లక్షల నగదు తన భార్య పేరిట ఉన్నట్టు పేర్కొన్నారు. డిపాజిట్లు, వాటాలు తన పేరిట రూ.20.96 కోట్లు, తన భార్య పేరిట రూ.11.07 కోట్లు, తన పేరిట రెండు కిలోల బంగారం, 20 కిలోల వెండి, తన భార్య పేరిట 3 కిలోల బంగారం, కిలో వెండి ఉన్నట్టు వివరించారు. ఆరణిలో పంట పొలాలు, బెంగళూరు ప్రాంతాల్లో స్థిర ఆస్తులు ఉన్నట్టు వివరించారు. మొత్తంగా రూ.106 కోట్లు ఉన్నట్టు ప్రకటించిన ఆయన అప్పులు రూ.24 కోట్లు తన పేరిట, రూ.10.43 కోట్లు తన భార్య పేరిట ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement