ముంబై: 'లోకల్ రైల్వే స్టేషన్లలో చిరుత సంచారం' వార్తలు ముంబై వాసులను కాసేపు హడలగొట్టేశాయి. వేలమంది జనం, సాయుధ రైల్వే పోలీసుల నడుమ రైల్వే స్టేషన్ లో చిరుతపులి సంచారం సాధ్యమేనా? అనుకుంటూ యధావిధిగా స్టేషన్లకు వెళ్లినవారికి నిజంగానే పులల చిత్తరువులు కనిపించాయి.
ఖర్, బోరీవ్యాలీ లోకల్ స్టేషన్ ఫ్లాట్ ఫామ్ మెట్లపై ఠీవిగా నిల్చున్న చిరుతపులి బొమ్మలు చూసి అవాక్కయిన ప్రయాణికులు.. వాటిని గీసినవాళ్లను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అంత అందంగా కుదిరాయా చిత్తరువులు. ఒక్క చిరుతపులేకాదు జీబ్రా, ఉదయిస్తున్న సూర్యుడు, పచ్చని చెట్లు తదితర బొమ్మలు స్టేషన్ గోడలపై అలరిస్తున్నాయి. రద్దీ ప్రదేశాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించేందుకు మేక్ ఎ డిఫరెన్స్(ఎంఏడీ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ చిత్తరువుల పనిని చేపట్టింది.
ఒక్క రైల్వే ష్టేషన్లేకాక నేషనల్ హైవేలు, బీచ్ లు, పార్కుల వంటి పబ్లిక్ ప్లేసెస్ లోనూ అందమైన బొమ్మలు ఫ్రీగా గీసిపెట్టేందుకు సిద్ధమవుతోంది ఎంఏడీ. ఖర్, బోరీవ్యాలీ స్టేషన్లలో కనువిందు చేస్తోన్న ఈ చిత్రరాజాలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నారు.