= వంట గ్యాస్‌కు లింక్‌పై మొయిలీ
= సుప్రీం కోర్టు ఆదేశాన్ని పాటించాల్సిందే
= ఆధార్ సంఖ్యను గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకులకు ఇస్తే మంచిదే
= బోగస్ కనెక్షన్లను నివారించవచ్చు
= అమలు కాని మంత్రి, ‘సుప్రీం’ ఆదేశాలు‘
= ‘ఆధార్’ ఇవ్వాల్సిందేనంటూ ఏజెన్సీల నుంచి మెసేజ్‌లు
= సిలిండర్ల సరఫరాలో అసాధారణ జాప్యం.. వినియోగదారుల్లో అసహనం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) లేదనే సాకుతో గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు వంట గ్యాస్‌ను నిరాకరించడానికి వీల్లేదని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ఇక్కడి జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో శనివారం ఏర్పాటు చేసిన అఖిల భారత 66వ వాణిజ్య సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సబ్సిడీలను పొందడానికి ఆధార్‌ను నిర్బంధం చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో వంట గ్యాస్‌కు కూడా ఆ నిబంధన ఉండబోదని తేల్చి చెప్పారు. అయితే ఆధార్ సంఖ్యను గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకులకు అందజేస్తే వినియోగదారులకే అనుకూలమని పేర్కొన్నారు.
దేశంలో 14 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉంటే మూడు కోట్లు నకిలీవనే అంచనాలున్నాయని వెల్లడించారు. ఆధార్ సంఖ్య వల్ల ఇలాంటి బోగస్ కనెక్షన్లను నివారించవచ్చని సూచించారు. తద్వారా వంట గ్యాస్ ధర కూడా తగ్గే అవకాశాలున్నాయని చెప్పారు. ఆధార్ లేకపోతే సిలిండర్లను ఇచ్చేది లేదంటూ గ్యాస్ ఏజెన్సీలు మొండికేస్తున్న విషయాన్ని ఆయనృదష్టికి తీసుకెళ్లినప్పుడు, దానిని సమర్పించాలని కోరవచ్చునే కానీ బలవంత పెట్టరాదని అన్నారు.
ఉత్తుత్తి మాటలే...
వంట గ్యాస్‌కు ఆధార్‌ను లంకె పెట్టిన విషయంలో మంత్రి డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. గతంలో గ్యాస్ కోసం ఎస్‌ఎంఎస్ చేస్తే క్షణాల్లో రిజిస్ట్రేషన్ నంబరు వచ్చేది. ఇప్పుడు ‘ఇన్‌వాలిడ్ కీవర్డ్’ అంటూ ప్రత్యుత్తరం వస్తోంది. ఫోన్ ద్వారా బుక్ చేసుకుంటున్నా, ‘సబ్సిడీ పొందడానికి ఆధార్ నంబరును మీ డిస్ట్రిబ్యూటర్, బ్యాంకులకు ఇవ్వండి’ అని వెంటనే మెసేజ్ వస్తోంది.
మార్చి ఒకటో తేదీ లోగా నగరంలో ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయకపోతే మార్కెట్ ధరకే సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గ్యాస్ ఏజెన్సీలు సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే రీతిలో వ్యవహరిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మిన్నకుండి పోతోంది. ఏజెన్సీల చర్య కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని పలువురు వినియోగదారులు నొక్కి చెబుతున్నా, చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందాన తయారైంది. మరో వైపు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసే ప్రక్రియలో తలమునకలుగా ఉన్న ఏజెన్సీలు సిలిండర్ల సరఫరాలో అసాధారణ జాప్యాన్ని ప్రదర్శిస్తూ, వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.
ఆధార్ నిర్బంధం కాదు
Published Sun, Dec 8 2013 2:35 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
Advertisement
Advertisement