
ఆప్ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహానియాకు బెయిల్ లభించింది. ఆయనకు సాకేత్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా గతంలో దినేశ్ మోహానియాకు న్యాయస్థానం బెయిల్ తిరస్కరించిన విషయం తెలిసిందే. నీటి సరఫరా సక్రమంగా చేయాలని కోరుతూ తన దగ్గరకు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను హింసించిన ఘటనలో దినేష్ మోహనియాపై ఐపీసీ 306, 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
గతవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దినేశ్ మోహానియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఎమ్మెల్యే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కాగా ఆప్ నేతలు ఇలా కేసుల్లో ఇరుక్కోవడం ఇదే తొలిసారి కాదు. ఎమ్మెల్యేలు ధర్మేంద్ర సింగ్, సోమ్‌నాథ్ భారతి, మరో నేతపై కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో ఇప్పటివరకూ ఢిల్లీ పోలీసులు ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు.