న్యూఢిల్లీ: సరిగ్గా ఐదు నెలల క్రితం ఢిల్లీ రాజకీయాల్లో నవచరిత్ర సృష్టించిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈసారి అదే ఊపును కొనసాగిస్తుందా? తిరిగి అధికారాన్ని దక్కించుకుంటుందా? అసెంబ్లీలో లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేసిన కేజ్రీవాల్‌ను తిరిగి ప్రజలు ఆమోదిస్తారా? దేశ రాజధానిలో ఇప్పుడు ఎక్కడా చూసినా ఇదే హాట్ టాపిక్ వినిపిస్తోంది. దీనికితోడు తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డీలాపడటం, ఆ వెంటనే పార్టీ సీనియర్ నేతలు రాజీనామాలు చేయడం ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న చీపురు గుర్తు పార్టీ మళ్లీ ఢిల్లీపై పట్టు సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం మిషన్ 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
‘మహారాష్ట్ర, హర్యానాలతో పాటుగా అక్టోబర్‌లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించాం. లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ఓడిపోయామనే దానిపై వీరంతా నివేదికలు పంపించే పనిలో నిమగ్నమయ్యార’ని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఏడు లోక్‌సభ స్థానాల్లో ఒక్కటీ దక్కించుకొని ఆప్‌కు మాత్రం ఓటు శాతం పెరగడం ఒక రకంగా ఉత్సాహన్నిస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 29.3 శాతం ఉన్న ఓటు బ్యాంక్ లోక్‌సభ ఎన్నికల్లో 32.9 శాతానికి పెరిగింది. అన్ని స్థానాల్లో ఆప్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 60 నుంచి 70 స్థానాల్లో బీజేపీ ముందుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధించడం ఎలా అనే దానిపై ప్రధానంగా దృష్టి సారించింది. ‘ఆర్‌కే పురం, ఓకాలో మా పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంది.
మధ్య తరగతి నియోజకవర్గాల్లో మరింత శ్రమించాల్సి ఉంది. గ్రేటర్ కైలాశ్, మాల్వియా నగర్‌లో పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు కష్టించాల్సిన అవసరముంద’ని ఆప్ నాయకుడు ఒకరు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేజ్రీవాల్ పెద్ద హీరో కాదని, ఇప్పటికీ అలానే ఉన్నాడని పార్టీ భావిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి సీఎం అభ్యర్థి లేరని కేజ్రీవాల్ తరపున న్యూఢిల్లీ, వారణాసిలో ఎన్నికల ప్రచారం చేసిన గోపాల్ మోహన్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన వారిలో 20 శాతం మంది మోడీని ప్రధాని చేసేందుకు వేశామని అంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తామని చెబుతున్నారని ఆయన చెప్పారు. ఒకవేళ ఇదే జరిగి పది శాతం ఓటింగ్‌కు తమ పార్టీకి వస్తే 43 శాతానికి పెరుగుతుందని, బీజేపీ ఓటు బ్యాంక్ 36 శాతానికి పడిపోతుందని తెలిపారు. ఢిల్లీలో ఇప్పటికీ ఆప్ పటిష్టంగా ఉందని బీజేపీ గుర్తించిందని రాజకీయ విశ్లేషకుడు రవి రాజన్ చెప్పారు.
అయితే హర్షవర్ధన్ కేంద్ర మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టడంతో బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటిస్తారాన్న దానిపై ఆ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉందని తెలిపారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అనేక స్థానిక సమస్యలు ప్రజలను ప్రభావితం చేస్తామని, ఇక్కడ పోలింగ్ మరో రకంగా ఉంటుందని చెప్పారు. విద్యుత్ రాయితీ, ఉచిత నీటి సరఫరా, అవినీతి రహిత యంత్రాంగాన్ని తీసుకొస్తామన్న పాత హామీలతోనే మళ్లీ కేజ్రీవాల్ పార్టీ ఢిల్లీవాసుల ముందుకు వెళుతుందని తెలిపారు. బీజేపీ నేత నితిన్ గడ్కారీ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ జైలుకెళ్లడాన్ని సమర్థిస్తూ ఆప్ వాలంటీర్లు ఇంటి ఇంటికీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు.
కేజ్రీవాల్ లేఖలపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: తీహర్ జైలు నుంచి తన మద్దతుదారులకు బహిరంగ లేఖలు రాసిన కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. ఆ లేఖలను పంపిణీ చేయడంపై నిషేధం విధించడంపై ఏమీ చేయలేమని పిటిషన్‌దారు శర్మకు స్పష్టం చేసింది. ‘ఇది కోర్టు పరిధిలోని అంశం కాదు. కావాలనుకుంటే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చ’ని ఆదేశించింది. కేజ్రీవాల్ బహిరంగ లేఖలు ఉపసంహరించుకునేంత వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలని శర్మ పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, పాటియాలా కోర్టులో రూ.పదివేల పూచీకత్తుతో బెయిల్ బాండ్ సమర్పించిన కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
మరోసారి ఆపేనా?
Published Wed, May 28 2014 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement
Advertisement