ఆమెతో మా ఎమ్మెల్యేకు సంబంధం లేదు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ వక్ఫ్ బోర్డు చీఫ్ అమనతుల్లా ఖాన్ అన్ని పదవులకు చేసిన రాజీనామాను ఆ పార్టీ తిరస్కరించింది. ప్రజలకు సేవ చేస్తుంటే తనను, తన కుటుంబాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా అమనతుల్లా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆయన బావమరిది భార్య జామియా నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందిస్తూ.. 'అమనతుల్లాపై వచ్చిన ఫిర్యాదులోని వాస్తవాలను పరిశీలించాం. ఆయన బావమరిది మాజీ భార్య ఫిర్యాదు చేసింది. అమనతుల్లా బావమరిది నాలుగేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆమెతో అమనతుల్లాకు ఎలాంటి సంబంధం లేదు. కుటుంబంలోని వివాదాల వల్లే అమనతుల్లా పేరును కేసులోకి లాగారు. మా పార్టీలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం. అయితే దురుద్దేశపూర్వకంగా వారిపై కేసులు పెడితే అండగా ఉంటాం. ఈ వివరాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్కు, పార్టీ సీనియర్ నేతలకు చెప్పాను. అమనతుల్లా రాజీనామాలను తిరస్కరించాలని నిర్ణయించాం' అని చెప్పారు.