‘పరువు కాపాడుకునేందుకే మమ్మల్ని బలి చేశారు’
న్యూఢిల్లీ: ఆరుషి, హేమరాజ్ హత్య కేసుల్లో రాజేశ్, నూపుర్ తల్వార్లకు యావజ్జీవ శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు మంగళవారం వెలువరించిన తీర్పుపై వారి స్నేహితులు, బంధువులు, న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. ఈ కేసు పూర్తి బలహీనంగా ఉన్నా, సీబీఐ తన పరువును దక్కించుకోవడానికే తల్వార్లను ఇరికించిందని ఆరోపించారు. సీబీఐ పూర్తిస్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేసి, కేసును తప్పుదోవ పట్టించిందని తల్వార్ దంపతుల న్యాయవాది రెబెక్కా జాన్ ఆరోపించారు. సీబీఐ కుట్రలకు తల్వార్లు బలయ్యారని, ఈ కోర్టు తీర్పు పైకోర్టులో నిలవబోదని చెప్పారు. వృత్తిరీత్యా వైద్యులైన రాజేశ్, నూపర్ ఆస్పత్రికి వచ్చే రోగులు కూడా ఇదే తరహాలో స్పందించారు.
‘శిక్ష వేసేందుకు అవసరమైన సాక్ష్యం ఒక్కటి కూడా లేదు. పోలీసులు, సీబీఐవి అన్నీ నిరాధార ఆరోపణలు’ అని రాజేశ్ కుటుంబ స్నేహితుడు మేయర్ బల్వంత్ సింగ్ అన్నారు. ఆరుషి దగ్గరి బంధువు శ్రీ పరాడ్కర్ మాట్లాడుతూ ‘సీబీఐ సమర్పించిన సాక్ష్యాలు, తీర్పును పరిశీలిస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. అసలు హత్యకు గల కారణమేంటో కూడా సీబీఐ వివరించలేదు. సీబీఐ తన పరువును కాపాడుకోవడానికే ఇంతగా దిగజారింది’ అని ఆరోపించారు. తన అన్నయ్య, వదినలు ఈ హత్య చేయలేదని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ఎన్నో ఉన్నా వాటిని పట్టించుకోలేదని రాజేశ్ సోదరుడు దినేశ్ అన్నారు. ఆరుషి, హేమ్‌రాజ్‌ను ఇంకెవరో హత్య చేశారని, నిజమైన సాక్ష్యాలను సీబీఐ దాచిపెట్టిందని ఆరోపించారు. దొంగ సాక్ష్యా లు ద్వారా సీబీఐ కేసును తప్పుదారి పట్టించిందని దినేశ్ భార్య వందన ఆరోపించారు. హేమరాజ్ రక్తం రాజేశ్ ఆస్పత్రి కాంపౌండర్ కృష్ణ దిండుపై ఉన్న విషయాన్ని సీబీఐ వదిలేసిందన్నారు.
హైబీపీ ఉన్నట్టు తెలిపిన నూపుర్
ఘజియాబాద్: దోషిగా నిర్ధారణ కావడంతో ఘజియాబాద్ దాస్నా జైలుకు వెళ్లిన నూపుర్ తల్వార్ తాను అధిక రక్తపోటు, ఆందోళనతో బాధపడుతున్నట్టు తెలిపింది. ఆమె సోమవారం రాత్రి 9.30 గంటలకు అనారోగ్యంపై ఫిరాదు చేసినట్టు జైలు వర్గాలు తెలిపాయి. ఆమెకు బీపీ, ఆందోళనతోపాటు ఎసిడిటీ ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆమెకు సూచించామని, ఆరోగ్యం బాగుపడ్డాకే కోర్టుకు తరలిస్తామని జైలర్ విశేష్‌రాజ్ శర్మ చెప్పారు.