ఆర్థికంగా చితికిన అన్నాడీఎంకే కార్యకర్తలకు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత అండగా నిలిచారు. అన్నాకార్మిక సంఘం పరిధిలోని 106 కార్యకర్తల కుటుంబానికి రూ.53 లక్షలను పంపిణీ చేశారు. అలాగే, తనిఖీల్లో లారీ ఢీ కొని మరణించిన సబ్ ఇన్‌స్పెక్టర్ రవిచంద్రన్ కుటుంబానికి రూ.ఐదు లక్షలు ప్రకటించారు.
సాక్షి, చెన్నై: పార్టీ కోసం శ్రమించి ఆర్థికంగా చితికి కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకునే రీతిలో ప్రతి ఏటా మేడే వేడుకల్లో అన్నాడీఎంకే నేతృత్వంలో ఆర్థిక సాయం పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆ పంపిణీ వాయి దా పడింది. పార్టీ అనుబంధ విభాగం అన్నా కార్మిక సంఘం పరిధిలో ఉన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకునే రీతిలో బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయం లో ఆర్థిక సాయం పంపిణీ చేశారు. అందుకోసం పోయేస్ గార్డెన్ నుంచి రాయపేట కార్యాలయానికి బయలుదేరిన జయలలితకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు.
మేళ తాళాలు, కేరళ వాయిద్యాలు, కళాకారుల నృత్య ప్రదర్శనలతో దారి పొడవున ఆమెకు స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న జయలలితకు మంత్రులు పన్నీరు సెల్వం, వలర్మతి, సెంథిల్ బాలాజీ, గోకుల ఇందిర, టికేఎం చిన్నయ్య, మాదవరం మూర్తి, విజయ భాస్కర్, అన్నాకార్మిక సంఘం కార్యదర్శి , ఎమ్మెల్యే చిన్న స్వామి, ఆ విభాగం నేతలు కేఎస్ అస్లాం, మిన్నల్ వాసన్, ఎంపీలు జయ వర్ధన్, ఎస్‌ఆర్ విజయకుమార్, టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు కళైరాజన్, కుప్పన్, కేపీ కందన్, జయకుమార్ తదితరులు స్వాగతం పలికారు.
ఆర్థిక సాయం: అన్నా కార్మిక సంఘం పరిధిలో ఉన్న 106 మంది కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ప్రమాదం బారిన పడి మరణించిన, అవయవాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలు ఇందులో అధికంగా ఉన్నారు. ఒక్కోకుటుంబానికి రూ. 50 వేలు చొప్పన మొత్తంగా రూ. 53 లక్షలు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను గుర్తించి ఆదుకున్న జయలలితకు ఆ కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశారుు. తామెప్పుడూ పార్టీకి రుణపడి ఉంటామంటూ ఆ కుటుంబాలు పేర్కొన్నాయి. రెండు రోజుల క్రితం వానగరంలో తనిఖీల్లో నిమగ్నమైన సబ్ ఇన్‌స్పెక్టర్ రవిచంద్రన్‌ను ఓ లారీ ఢీ కొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన రవిచంద్రన్ కుటుంబానికి రూ.ఐదు లక్షలు ప్రకటించారు.
కార్యకర్తలకు ‘జయ’ అండ
Published Wed, May 28 2014 11:17 PM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
Advertisement