యాక్టర్ అయిన పెలైట్
సినిమా ఫ్యాషన్ అయినప్పుడు వేరే వృత్తిపై మనసు లగ్నం కావడం కష్టమే. అలా పెలైట్‌గా శిక్షణ పొంది యాక్టరయ్యూరు జితేష్. ఉపాధ్యాయ కుటుంబానికి చెందిన ఈయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. హీరోగా తొలి చిత్రం చిక్కు ముఖి. మలి చిత్రం తలకోణం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇంతకీ ఈయన కథేంటో ఆయన మాటల్లోనే చూద్దాం. చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. అందుకే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివినా సినిమా రంగంపైనే మొగ్గు చూపాను. చదువుకునే రోజుల నుంచే స్టేజీ అనుభవం ఉంది. పలు నాటకాలు ఆడాను. ఆ తరువాత మోడలింగ్ రంగానికి పరిచయమయ్యాను. ప్రముఖ వాణిజ్య సంస్థలు చెన్నై సిల్క్స్, రామ్‌రాజ్ శ్రీదేవి టెక్స్‌టైల్స్‌కు మోడల్‌గా నటించాను. యూకేలో 45 నిమిషాల నిడివి గల రెండు చిత్రాల్లో నటించాను.
నృత్య దర్శకుడు శ్రీధర్ వద్ద నృత్యంలో శిక్షణ పొందాను. ఒక నాటక ప్రదర్శనలో చూసిన చిక్కిముఖి చిత్ర నిర్మాత ఆ చిత్రంలో కథానాయకుడిగా అవకాశం కల్పించారు. ఆ తరువాత తలకోణం చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ మధ్యనే నాళై ఇయక్కునర్ (రేపటి దర్శకులు) టీమ్‌కు చెందిన భారతీ బాలకుమారన్ దర్శకత్వంలో సత్య ప్రమాణం అనే లఘు చిత్రంలో నటించాను. ఈ లఘు చిత్రం త్వరలో చలన చిత్రంగా రానుంది. చిన్నతనం నుంచి నటుడు అజిత్ అంటే పిచ్చి అభిమానం. ఒక రకంగా ఆయనే నాకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మంచి చిత్రాలు చేసి నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం నటుడిగా ఎదగాలన్నదే.