
రీ ఎంట్రీకి సిద్ధం
జీవితం ఎటు పరిగెడుతుందో ఎక్కడ ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. అలా నటీమణులుగా సాధించి ఇక చాలు అనుకుని సంసార జీవితంలో స్థిరపడిన ముగ్గురు మరోసారి ముఖానికి రంగేసుకుని విజయానికి దగ్గరవుతున్నారు. అయితే ఆ ముగ్గురి రీ ఎంట్రీకి ఒక కథ కారణం కావడం విశేషం. ఇంతకీ వారెవరో వారి కథేంటో చూద్దామా!
మలయాళ నటి మంజువారియర్ ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందారు. ఆ తరువాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సినిమాలకు దూరం అయ్యారు. అలాంటి నటి చాలా గ్యాప్ తరువాత నటించిన చిత్రం హౌ ఓల్డ్ ఆర్ యు. ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ అయిన మంజువారియర్‌కి మలయాళంలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే ఈ హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం అంతటితో ఆగలేదు. తమిళంలో పునర్నిర్మాణానికి సిద్ధమవుతోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో మంజువారియర్ పాత్రను జ్యోతిక పోషిస్తున్నారు.
ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమను ప్రముఖ కథానాయికిగా ఏలారు. మంచి ఫామ్‌లో ఉండగానే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యూరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జ్యోతిక హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం ద్వారా రీ ఎంట్రీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆమె జీవిత భాగస్వామి సూర్య నిర్మించడం విశేషం. మలయాళం చిత్రానికి దర్శకత్వం వహించిన రోషన్ ఆండ్రూస్‌నే ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ కాజోల్ తన రెండో ఇన్నింగ్ ప్రారంభించనున్నారు.
కాజోల్ భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్రవేసుకున్న నటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కూడా ప్రముఖ నటిగా వెలుగొందుతున్న సమయంలోనే సహ నటుడు అజయ్ దేవగణ్‌ను ప్రేమించి పెళ్లాడారు. ఆ తరువాత నటనకు దూరమవుతూ వచ్చారు. అలాంటి నటి హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రంతో నటనకు పునరంకితం అవుతున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో ఆమె భర్త అజయ్ దేవగన్ నిర్మించడం విశేషం. ఇలా ముగ్గురు ప్రముఖ నటీమణుల్ని మళ్లీ తెరపైకి చూడడానికి కారణమైన చిత్రం హౌ ఓల్డ్ ఆర్ యుకు హేట్సాప్ చెప్పాల్సిందే.