ఆయన భాష అర్థం కాదు
టీనగర్: అర్థం కాని భాషలో మాట్లాడి విజయకాంత్ ప్రజలను తికమకపెడుతున్నట్లు నటి వింధ్య విమర్శించారు. మదురైలో జరిగిన అన్నాడీఎంకే బహిరంగ సభలో నటి వింధ్య మాట్లాడారు. జయలలిత ప్రజల కోసం స్వర్ణయుగ పాలన జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతోనే అన్నాడీఎంకే కూటమి ఏర్పరచుకుని ఎన్నికలను ఎదుర్కొంటోందని, అయితే పదవీ వ్యామోహంతో ప్రతిపక్షాలు సంప్రదాయాలు, విలువలు లేని పార్టీలతో కూటమి ఏర్పాటుచేసుకుని ప్రజల వద్ద ఓట్లడుగుతున్నట్లు తెలిపారు.
పనికిరాని స్నేహం అనర్థానికి దారి తీస్తుందని కరుణానిధి పదే పదే చెప్పేవారని, ప్రస్తుతం వేరే గత్యంతరం లేక మళ్లీ కాంగ్రెస్ పార్టీతో కూటమి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. దీన్ని ప్రజలు అంగీకరించబోరన్నారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలేస్తోందని తెలిపారు. కామరాజ్ బాటలో నడిచిన కాంగ్రెస్ పార్టీ అంటూ కుష్బూ, నగ్మాలను నమ్ముకోవడం చూస్తే బాధగా ఉందన్నారు. ప్రజా సంక్షేమ కూటమి అంటూ ఒకటుందని, విజయకాంత్‌ను ముఖ్యమంత్రి చేయాలన్నదే వారి లక్ష్యం అన్నారు. విజయకాంత్ ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియడం లేదన్నారు. ఆయనకు రాష్ట్రాన్ని పాలించే సత్తా వుందా? అంటూ విమర్శించారు.
ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆరాటపడే విజయకాంత్ ఏమి మాట్లాడేది ఆయనకే అర్థం కాదన్నారు. బాహుబలి చిత్రంలో నల్లజాతి ప్రజలు కనిపిస్తారని, వారు అర్థం కాని బాషలో మాట్లాడి ప్రేక్షకులను తికమక పెడతారన్నారు. అదే విధంగా విజయకాంత్ మాట్లాడుతూ ప్రజలను తికమకపెడుతున్నట్లు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 234 నియోజకవర్గాలలో ఘన విజయం సాధిస్తుందని, మళ్లీ ఆరోసారి ముఖ్యమంత్రిగా జయలలిత పదవిని అధిష్టిస్తారని తెలిపారు.