‘ఆత్మ’ ఫలితాలేవి.?
Published Fri, Sep 23 2016 12:04 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
పాలకవర్గ సమావేశంలో కలెక్టర్ జగన్మోహన్ అసంతృప్తి
అధికారులపై ఆగ్రహం
క్షేత్ర సందర్శన చేసిన రైతుల వివరాలివ్వాలని ఆదేశం
ఆదిలాబాద్ అర్బన్ : ‘‘వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఫలితాలేవి..? ఎజెండాలో పొందుపర్చిన లెక్కల తీరు సరిగ్గా లేదు. వచ్చిన నిధులు, మిగిలిన బ్యాలెన్స్‌షీట్ కాపీ తప్పితే ఎజెండా కాపీలో ఏమీ లేదు. ఎంతమంది రైతులను క్షేత్ర స్థాయి సందర్శనలకు తీసుకెళ్లారో అధికారుల వద్ద వివరాలు లేవు.. మండలాల వారీగా ఎంత నిధులు వెచ్చించారు.. ఎన్ని వినియోగించారన్నది తెలియదు. రైతు, రైతుమిత్ర సంఘాలు ఎన్నెన్ని ఉన్నాయో అసలు గుర్తే లేదు. ఇవన్నీ చూస్తే రైతులకు సాంకేతిక సూచనలు అందుతున్నాయో.. లేదోనన్నా అనుమానాలు తలెత్తుతున్నాయి. రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన ఆత్మ పనితీరు బాగాలేదు. పనితీరు మార్చుకోవాలి...’’ అంటూ ఆత్మ పాలకవర్గ సమావేశంలో కలెక్టర్ జగన్మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్, ఆత్మ పాలక వర్గ చైర్మన్ ఎం.జగన్మోహన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, పశు సంవర్థక, ఉద్యానవన శాఖ, మత్స్యశాఖ, ఆత్మ అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఆత్మ అమలు చేస్తున్న కార్యక్రమాలపై తెలుసుకున్నారు.
వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయంపై రైతులకు కల్పించే అవగాహన కార్యక్రమాలు, శిక్షణలు, సూచనలతోపాటు ఏ శిక్షణ ఇస్తే పంటల సాగులో రైతులు లాభాలు పొందుతారో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పత్తి, సోయా, మొక్కజొన్న, వరి తదితర పంటలపై శిక్షణలు ఇవ్వడం, సాగును కాపాడుకోవడం, లాభాలు ఆర్జించడం, విజ్ఞాన యాత్రలకు వెళ్లి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం వంటి కార్యక్రమాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 2015 మార్చి నుంచి 2016 ఆగస్టు వరకు ఎంత మంది రైతులను విజ్ఞాన యాత్రల పేరిట ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లారు..? వారిలో ఎంత మంది నేర్చుకున్నారు.. అందులో మహిళా రైతులు ఎంత మంది ఉన్నారు.. అనే వివరాలు కావాలని ఆత్మ పీడీ మనోహర్‌ను ఆదేశించారు. రైతు, రైతు మిత్ర సంఘాలు ఎన్నెన్ని ఉన్నాయో కూడా అధికారులు తెలియదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10 వేల మంది రైతులను విజ్ఞాన యాత్రలకు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తారని అనుకుంటే 187 మందిని మాత్రమే తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజ్ఞాన యాత్రలకు అయ్యే ఖర్చు భరిస్తామని చెప్పినా కూడా ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఆత్మ పీడీ మనోహర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుమిత్ర సంఘాలు ఎన్నో తెలియదు.. ఉన్న గ్రూపులు పోతున్నాయి.. నిధులు ఖర్చవుతున్నాయి ఇక సమావేశాలెందుకని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి ఆశాకుమారి, పశుసంవర్థక శాఖ జేడీ ప్రేమ్‌దాస్, ఉద్యానవన శాఖ డీడీ నర్సింగదాస్, జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈఓ కె.నరేందర్, వ్యవసాయ శాఖ ఏడీ లు రమేష్, పుల్లయ్య, ఆదర్శ రైతులు కొండయ్య చౌదరి, గణపతిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Advertisement