తెగబడ్డారు
- మృగాళ్ల బారిన పడ్డ ఓ యువతి, ముగ్గురు బాలికలు
- యువతిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురి అరెస్ట్
- నిందితులు సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల కుమారులు
- 14 ఏళ్ల బాలికపై ఐదు నెలలుగా ఇద్దరి ఘాతుకం
- మతిస్థిమితం లేని బాలికపై తండ్రి బరితెగింపు
- ఒంటరిగా ఉన్న బాలికపై చిన్నాన్న దాష్టీకం
బెంగళూరు : నగరంలో మళ్లీ అత్యాచారాల పరంపర కొనసాగింది. మూడు వేర్వేరు సంఘటనల్లో ఓ యువతి, ఇద్దరు బాలికలు మృగాళ్ల బారిన పడ్డారు. నగర శివారులోని తావరకెరె పోలీసు స్టేషన్ పరిధిలో బీహార్‌కు చెందిన 23 సంవత్సరాల యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఆమె మెజిస్టిక్‌లో స్నేహితులతో కలసి విందులో పాల్గొంది. అనంతరం విజయ నగర చేరుకుని ఇంటికి వెళ్లడానికి బస్సు కోసం వేచి ఉన్న సమయంలో డ్రాప్ ఇస్తామనే నెపంతో ముగ్గురు ఆమెను కారులోకి ఆహ్వానించారు.
అనంతరం తావరకెరె సమీపంలోని ఓ ఫాం హౌస్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం వేకువ జామున 5.30 సమయంలో వారి చెర నుంచి ఆమె తప్పించుకుని బయటపడింది. అర్ధ నగ్నంగా రోడ్డుపై పరుగెడుతున్న ఆమెను ఓ కారు డ్రైవర్ గమనించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. వెంటనే పోలీసులు ఫాం హౌస్‌కు వెళ్లి నిందితులను పట్టుకున్నారు. అరుణ్ గౌడ, మాదేశ్, కెంప అనే వారిని వారిని అరెస్టు చేసినట్లు రామనగర ఎస్‌పీ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు. వీరిలో అరుణ్ గౌడ కర్ణాటక పాడి సమాఖ్య డెరైక్టర్ కుమారుడని తెలిసింది. మాదేశ్, కెంపలు కూడా సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల కుమారులని సమాచారం. యువతిని వైద్య పరీక్షలకు తరలించారు.
మరో సంఘటనలో 14 ఏళ్ల బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. నెలమంగల సమీపంలోని మాదననాయకనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది. ఓ టైలరు, మరో కార్మికుడు ఆ బాలికపై అయిదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల కడుపు నొప్పి రావడంతో తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరీక్షల్లో గర్భం దాల్చినట్లు తేలింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గణేశ్, రమేశ్ అనే వారు తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
అయితే పోలీసులు బాలికను ప్రశ్నించినప్పుడు, పరస్పర అంగీకారంతోనే తాను వారితో సంబంధాలు పెట్టుకున్నట్లు చెప్పినట్లు తెలిసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకో సంఘటనలో మతి స్థిమితం కోల్పోయిన బాలిక (13)పై తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానిక శ్రీరాంపురలోని లక్ష్మీనారాయణపురలో నివాసం ఉంటున్న వ్యక్తి (40) ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో గత నాలుగు నెలలుగా కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.
ఓ రోజు అతని అత్త ఈ ఘోర కృత్యాన్ని కళ్లారా చూసింది. ఆ సందర్భంలో అతను తప్పించుకుని చెన్నైకి పారిపోయాడు. గురువారం అతడిని పోలీసులు అరెస్టు చేశారు.ఇంటిలో ఒంటరిగా ఉన్న అన్న కుమార్తె మీద కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరులోని ఆర్‌టీ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆర్‌టీ నగరలో ఉన్న తన సోదరుడి ఇంటికి యువకుడు(30) శనివారం వెళ్లాడు.
ఆ సమయంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న తన కుమార్తె(12)పై అతను అత్యాచారం చేశాడు. అనంతరం విషయాన్ని ఎవరితోనైనా చెబితే హతమారుస్తానని బెదిరించాడు. గురువారం బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి పిలుచుకెళ్లారు. పరీక్షల అనంతరం బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.