నామినేటెడ్ పదవులు నియామకంపై కసరత్తు ప్రారంభం
మహారాష్ట్ర ఎన్నికల తర్వాతే నియామకాలు
ఎమ్మెల్యేలకు విస్తృత అవకాశం?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని బోర్డులు, కార్పొరేషన్లకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డెరైక్టర్ల నియామకంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎప్పటిలాగే నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారు. దీనిపై కసరత్తు ప్రారంభించినట్లు అందరినీ నమ్మించడానికి ప్రయత్నించినా, మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల తర్వాతే ఈ నియామకాలపై ఆయన దృష్టి సారించనున్నట్లు సమాచారం. సుమారు 20 రోజుల పాటు తీరిక లేని పర్యటనలతో తలమునకలుగా ఉన్న సీఎం సోమవారం ఆశావహుల జాబితాను పరిశీలించారని తెలిసింది. సాయంత్రం ఆయన మల్లేశ్వరంలోని ఓ థియేటర్‌లో కన్నడ సినిమాను వీక్షించారు.
అంతకు ముందు క్యాంపు కార్యాలయం కృష్ణాలో విశ్రాంతి తీసుకుంటూనే, నియామకాలపై ప్రాథమిక కసరత్తు చేపట్టారు. ఈ నెల పది నుంచి దశలవారీ నియామకాలు చేపట్టాలని అనుకుంటున్నప్పటికీ, దీని వల్ల తేనె తుట్టెను కదిల్చినట్లు అవుతుందని కూడా ఆయన సందేహిస్తున్నారు. తొలుత కనీసం 30 బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలను చేపట్టాలనుకుంటున్నారు. శాసన సభ్యులకు ఎక్కువ అవకాశం కల్పించడం ద్వారా మంత్రి వర్గ విస్తరణపై ఉన్న ఒత్తిడి తగ్గించుకోవాలన్నది ఆయన వ్యూహంగా కనబడుతోంది. ఈ పదవులు వద్దన్న వారిని మాత్రమే మంత్రి వర్గ విస్తరణ సమయంలో పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నారు.
దీనికి పార్టీ అధిష్టానం అనుమతి కూడా అవసరం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోను పార్టీ కార్యకర్తలు, నాయకులను నియమించడానికి కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర నుంచి వచ్చే జాబితా ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. మహారాష్ర్ట శాసన సభ ఎన్నికల ప్రచారానికి సీఎం వెళ్లనున్నందున, ఈ నియామకాల వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదని పార్టీ నాయకులు నిరుత్సాహం చెందుతున్నారు. ఏదో ఒక నెపంతో ఈ నియామకాలను వాయిదా వేస్తూ వస్తున్న సీఎం, కనీసం ఈ నెలలోనైనా చేపట్టకపోతారా అని పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
మళ్లీ నామినేటెడ్ పదవుల ఊరింపు
Published Tue, Oct 7 2014 2:12 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement