-జేఏసీ ఛైర్మన్ కోదండరామ్
-జలవివాదాలు పరిష్కారం మంచిదే.. ఒప్పందాన్ని బయటపెట్టాలి
సాక్షి, హైదరాబాద్
రాజ్యాంగంలోని షెడ్యూలు 5లోని ఏజెన్సీ ప్రాంతాలను ఒకే జిల్లాలో ఉండేవిధంగా జిల్లాల పునర్విభజన ఉండాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం సూచించారు. తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. ఈ సమావేశం తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడుతూ షెడ్యూలు 5లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు పలు ప్రత్యేక హక్కులున్నాయని, వాటిని పరిరక్షించేవిధంగా జిల్లాల విభజన ఉండాలన్నారు. వరంగల్‌ను రెండుగా విభజించడం వల్ల దాని అభివృద్ధి ప్రమాదంలో పడే అవకాశముందని హెచ్చరించారు.
నెలరోజుల్లో ప్రజల నుంచి, వివిధ పక్షాల నుంచి వచ్చే అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోదండరాం కోరారు. జనగాం, గద్వాల జిల్లాల విషయంలోనూ స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. జిల్లాల ఏర్పాటు అవసరమేనని, జిల్లాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే జిల్లాల ఏర్పాటుతో ప్రజల మధ్య వైషమ్యాలను పెంచకుండా, జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటో వెల్లడించాలని కోరారు. జలవివాదాలను సాగదీయకుండా, చర్చల ద్వారా, సామరస్య వాతావరణంలో పరిష్కరించుకోవడం శుభపరిణామం అని కోదండరాం వ్యాఖ్యానించారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం మంచిదేనని, అయితే ఆ ఒప్పందం వివరాలేమిటో పూర్తిగా బయటపెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఒలింపిక్ క్రీడల్లో రజతపతకం సాధించిన సింధుకు కోదండరాం అభినందనలను తెలియజేశారు. అయితే గెలిచిన తర్వాత ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా, క్రీడలను ప్రోత్సహించేవిధంగా క్రీడా విధానాన్ని ప్రకటించాలని సూచించారు. ఆగష్టు 28న తెలంగాణ అభివృద్ధి నమూనా-జేఏసీ ఆలోచన అనే అంశంపై సెమినార్‌ను నిర్వహిస్తున్నట్టుగా జేఏసీ నేత పిట్టల రవీందర్ తెలిపారు. జోనల్ విధానాన్ని రద్దుచేయడానికి ముందు చర్చకు పెట్టాలని, ఇది సున్నితమైన అంశమని జేఏసీ నేత వెంకట రెడ్డి కోరారు.