బీజేపీతో దోస్తీకి సిద్ధం అంటూ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మలైస్వామి చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితలో ఆగ్రహాన్ని రేపాయి. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన మలైస్వామిపై కన్నెర్ర చేశారు. పార్టీ నుంచి ఉద్వాసన పలుకుతూ ఆదేశాలు జారీ చేశారు.
సాక్షి, చెన్నై : లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో వచ్చే ఫలితాల మేరకు ప్రధాని పీఠం ఎక్కాలన్న లక్ష్యంతో అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయ ఢంకా మోగించిన పక్షంలో తన కల నెరవేర్చుకోవడం సులభతరం అవుతుందన్న ధీమా ఆమెలో పెరిగింది. దీంతో ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా శ్రమించారు. అయితే, ప్రచార సభల్లో తొలుత ఎక్కడ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేయలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల అనంతరం మోడీకి మద్దతు ప్రకటించే అవకాశాలు ఉంటాయన్న ప్రచారం వేగం పుంజుకుంది. ఇది కాస్త మైనారిటీ ఓట్లకు గండి పడేలా చేస్తుందన్న భయంతో మోడీకి వ్యతిరేకంగా, గతంలో వాజ్‌పేయ్ సర్కారు వైఫల్యాలని అస్త్రంగా చేసుకుని విరుచుకు పడడం మొదలెట్టారు.
ఎట్టకేలకు ఎన్నికలు ముగిశాయి. ఇంటెలిజెన్స్ నివేదిక మాత్రం సీట్ల సంఖ్య తగ్గడం ఖాయం అన్నది స్పష్టం చేయడం జయలలితను ఆందోళనలో పడేసింది. ఆశించిన సీట్లు వస్తే ప్రధాని పీఠం లేదా, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో జయలలిత కీలక భూమిక పోషించడం తథ్యమన్న సంకేతాలతో వార్తా కథనాలు ఆరంభం అయ్యాయి. అన్నాడీఎంకేకు 30 వరకు సీట్లు రావొచ్చన్న ఎగ్జిట్ పోల్స్ సర్వే కాస్త అనుకూలతను కలిగించడంతో హుటాహుటిన కొడనాడు విశ్రాంతిని ముగించుకుని బుధవారం చెన్నైకు జయలలిత చేరుకున్నారు. ఫలితాల కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని ప్రకటించారు. అయితే, తదుపరి కార్యాచరణ గురించి పదేపదే మీడియా ప్రశ్నించినా, ఎన్నికల అనంతరం చూసుకుందామంటూ ముందుకు సాగారు. జయలలిత ఆచితూచి అడుగులు వేస్తే, ఆ పార్టీ సీనియర్ నేత కుండబద్దలు కొట్టి కలకలం సృష్టించారు.
వారిద్దరూ మిత్రులే: ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మలైస్వామి బీజేపీ, అన్నాడీఎంకేల మైత్రి ఖాయం అన్నట్టు కుండ బద్దలు కొట్టేశారు. జయలలిత, మోడీ ఇద్దరు మంచి మిత్రులు అని, రాజకీయంగా దారులు మాత్రం వారిద్దరివీ వేరు...అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో కలకలం సృష్టించాయి. జాతీయ స్థాయి ఫలితాల గురించి పక్కన పెడితే, మోడీ ప్రధాని అయ్యేందుకు తప్పకుండా తమ అధినేత్రి మద్దతు ఇస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్య జయలలితకు షాక్ తగిలేలా చేశాయి. పార్టీకి వ్యతిరేకంగా, తన వ్యాఖ్యలకు భిన్నంగా మలై స్వామి చేసిన వ్యాఖ్యల్ని జాతీయ , రాష్ట్ర మీడియా పరిగణనలోకి తీసుకుని కథనాల్ని అల్లేశాయి. మలై స్వామి వ్యాఖ్యలతో బీజేపీ వర్గాలు సైతం జయలలితకు అనుకూలంగా అభినందనలు తెలియజేయడానికి సిద్ధం కావడంతో మేల్కొన్నారు. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం వేడుకకు హాజరు కావాలంటూ జయలలితను ఆహ్వానించే ఏర్పాట్లు జరగడంతో జాతీయ మీడియాకు, రాష్ట్ర మీడియా కథనాలకు కల్లెం వేస్తూ జయలలిత ఉదయాన్నే నిర్ణయం తీసుకున్నారు.
ఉద్వాసన : మలైస్వామి వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన జయలలిత ఆయన్ను పార్టీ నుంచి సాగనంపుతూ నిర్ణయించారు. పార్టీలో గందరగోళం సృష్టించే విధంగా భిన్న స్వరాలతో వ్యాఖ్యలు చేసిన మలై స్వామితో పార్టీ వర్గాలు ఎవ్వరూ సంబంధాలు కలిగి ఉండకూడదని హెచ్చరించారు. పార్టీ సభ్యత్వం సైతం రద్దు చేసి మలై స్వామికి ఉద్వాసన పలికారు. ఇది కాస్త అన్నాడీఎంకేలోని మరి కొందరు సీనియర్లలో గుబులు రేపుతోంది. మలైస్వామి బాటలో తదుపరి టార్గెట్ ఎవరన్న ఉత్కంఠ నెలకొంది. ఇందుకు కారణం ఎక్కడెక్కడ అభ్యర్థులు ఓడతారో? అక్కడి నేతల భరతం పట్టేందుకు జయలలిత కసరత్తులు పూర్తి చేసి ఉండడం ఇందుకు నిదర్శనం. ఇక, ఉద్వాసనకు గురైన మలై స్వామి ఒకప్పుడు ఐఏఎస్ అధికారి. రాష్ట్ర ఎన్నికల అధికారిగా కూడా పనిచేశారు. 1999 నుంచి అన్నాడీఎంకేలో కొనసాగుతూ, ఓ మారు ఎంపీగా పదవి దక్కించుకున్న ఆయనకు తాజాగా ఉద్వాసన పలకడం గమనార్హం.
‘జయ’ కన్నెర్ర మలైస్వామికి ఉద్వాసన
Published Fri, May 16 2014 12:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement