పెద్దల సభలో ఎన్డీయే సెంచరీ
సాక్షి, న్యూఢిల్లీ : జేడీ(యూ) చేరిక, ఏఐఏడీఎంకే మద్దతుతో రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలం 100 దాటింది. అయితే ఎన్‌డీఏ వ్యతిరేక కూటమి సంఖ్యాపరంగా 117 సీట్లతో ఇప్పటికీ పైచేయిగా ఉంది. ఎస్‌పీ, జేడీయూ, ఎన్‌సీపీల మధ్య విభేదాలతో ఇవి ఐక్యంగా ముందుకుపోలేని పరిస్థితి. రాజ్యసభలో మెజారిటీ సాధించాలంటే బీజేపీకి 123 సీట్లు అవసరం.
యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో వచ్చే ఏడాది బీజేపీ 12కు పైగా స్ధానాలను గెలుపొందే వీలుంది. మరోవైపు గత రెండేళ్లలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఎదురవడంతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం 65 సీట్ల నుంచి 57 సీట్లకు పడిపోయింది.పాలక బీజేపీ బలం పుంజుకుంటూ రాజ్యసభలో మెజార్టీ సాధించే దిశగా ముందుకెళుతున్నది. కొద్దినెలల్లో పీజే కురియన్ రిటైర్ అవుతున్న క్రమంలో కూటమి నేతను ఆ స్ధానంలో కూర్చుండబెట్టాలని ఎన్‌డీఏ భావిస్తోంది.
ఇక ఏఐఏడీఎంకే వర్గాలు సైతం విలీనమై బీజేపీకి మద్దతు తెలిపే సంకేతాలతో ఆ పార్టీ ఎంపీలకు కేంద్ర క్యాబినెట్‌లో చోటు దక్కుతుందని సమాచారం. ఏఐఏడీఎంకే మద్దతు పొందితే రాజ్యసభలో ఎన్‌డీఏ బలం 102కు పెరుగుతుంది. వీరిలో 57 మంది బీజేపీ సభ్యులుకాగా, జేడీయూ(10), ఏఐఏడీఎంకే(13), టీడీపీ (6), శివసేన, అకాలీదళ్‌ల నుంచి ముగ్గురేసి సభ్యులు, ఇద్దరు పీడీపీ సభ్యులు, ఇతరులు నలుగురు సభ్యులున్నారు.వీరే కాక ఎన్‌డీఏకు రాజ్యసభలో కీలక సమయాల్లో అంశాల వారీగా టీఆర్‌ఎస్, వైసీపీ, ఐఎన్‌ఎల్‌డీ సభ్యుల మద్దతు కూడా లభిస్తున్నది.