అన్నాడీఎంకే నేత హత్య
Published Thu, Jan 30 2014 12:43 AM | Last Updated on Thu, May 24 2018 12:05 PM
టీనగర్, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే నేత మంగళవారం హత్యకు గురయ్యాడు. చెంగల్పట్టు గుండూరు ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నేత రాజగోపాల్ (52). తిరుమణి పంచాయతీ అధ్యక్షునికిగా ఉంటూ వచ్చారు. ఇతని మొదటి భార్య జయ. చెంగల్పట్టు మున్సిపల్ మాజీ అధ్యక్షురాలు, రెండవ భార్య భువనేశ్వరి ప్రస్తుతం తిరుమణి పంచాయతీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఈమె కుమారుడు సెంథిల్. చెంగల్పట్టు 27వ వార్డు కౌన్సిలర్‌గాను, అన్నాడీఎంకే ఇలంజర్ పాసరై కాంచీపురం జిల్లా అధ్యక్షునిగానూ ఉన్నారు. రాజగోపాల్ పైన గత 2004లో మనపాక్కం పాలారులో ఇసుక అక్రమాలకు అడ్డుకునేందుకు వెళ్లిన తిరుకళికుండ్రం తహశీల్దార్ వెంకటేశన్‌పై లారీ ఎక్కించి హత్య చేసిన కేసు సహా పలు కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తుల ముఠా రాజగోపాల్‌పై పెట్రో బాంబు వేసి హత్య చేసింది.
దీని గురించి చెంగల్పట్టు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలా ఉండగా బుధవారం ఉదయం రాజగోపాల్ భార్యలు జయ, భువనేశ్వరి, కుమారులు, కుమార్తెలు, బంధువులు, వంద మందికిపైగా అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రాస్తారోకో జరిపారు. దీంతో చెన్నై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఒక గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది. చెంగల్పట్టు పోలీసులు అక్కడికి చేరుకుని హంతకులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో చెంగల్పట్టులో పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. హంతకులను అరెస్టు చేసేందుకు నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు అయ్యాయి.
Advertisement
Advertisement