బాధతోనే బాధ్యతలు | AIADMK leader O Panneerselvam may be sworn in on Monday | Sakshi
Sakshi News home page

బాధతోనే బాధ్యతలు

Published Mon, Sep 29 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

బాధతోనే బాధ్యతలు

బాధతోనే బాధ్యతలు

 అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా సాగాల్సిన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం... చెమ్మగిల్లిన కళ్లు, బరువెక్కిన హృదయాల మధ్య కన్నీటితో సాగింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లేకుండా ఆ పార్టీ తరపున కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పన్నీర్‌సెల్వం కూడా విలపిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ప్రమాణం చేసిన మంత్రులందరూ కూడా కన్నీటిని ఆపులేకపోవడం గమనార్హం. సోమవారం జరిగిన ఈ కార్యక్రమం మొత్తం ఎక్కడా ఎలాంటి సందడి లేకుండా నిరాడంబరంగా ముగిసింది.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: అది చెన్నైలోని సచివాలయం... సోమవారం ఉదయం 10 గంటలు... శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన ఓ పన్నీర్ సెల్వం నేతృత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సమావేశం... తరువాత రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం... అక్కడా, ఇక్కడా  ఎలాంటి సందడి లేదు. ఎమ్మెల్యేల్లో ఉత్సాహం లేదు... చెమ్మగిల్లిన కళ్లు, బరువెక్కిన హృదయాలు... అమ్మ లేకుండా ఆ పార్టీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే ముందు సాక్షాత్కరించిన దృశ్యాలు ఇవి. సోమవారం మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం, ఆ తరువాత మంత్రులుగా మరో 30 మంది ప్రమాణం చేశారు. గవర్నర్ కే రోశయ్య వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
 
 18 ఏళ్లుగా నడుస్తున్న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు కాగానే అన్నాడీఎంకే శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. కన్నీళ్ల మాటునే జయ స్థానంలో మరో ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాల్సిన సంకటస్థితి. అత్యంత కష్టమైనా అమ్మ ఆదేశాలతో తప్పలేదు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన ఓ పన్నీర్‌సెల్వం ఆదివారం రాత్రి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందుకున్నారు. ఎప్పుడు ప్రమాణం చేస్తారన్న విషయం సోమవారం మధ్యాహ్నం వరకు ప్రకటించలేదు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిధులు సైతం పడిగాపులు కాస్తున్నారు.
 
 ఆలస్యం అయ్యే కొద్దీ రకరకాల పుకార్లు బయలుదేరాయి. రాజ్‌భవన్‌లో మరో 15 నిమిషాల్లో ప్రమాణ స్వీకారం అంటూ మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రకటించారు. అంతే ఒక వైపు అన్నాడీఎంకే శ్రేణులు, మరోవైపు మీడియా గవర్నర్ బంగ్లా వైపు పరుగులు తీయూల్సి వచ్చింది. అయితే అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు. జయ జైలులో ఉన్న ఈ ఉద్విగ్న పరిస్థితుల్లో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయడం లేదని రాజ్‌భవన్ వర్గాలు ప్రకటించాయి. మధ్యాహ్నం 1 గంటకు కాబోయే సీఎం కాన్వాయ్ రాజ్‌భవన్‌కు చేరుకుంది. బరువెక్కిన హృదయంతో గవర్నర్ బంగ్లాకు చేరుకున్న పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా, మరో 30 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం అయిందనిపించారు. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు సైతం నిరాడంబరంగా సాగాయి.
 
 క న్నీటితోనే ప్రమాణస్వీకారం
  అత్యంత ఉత్సాహంగా, సంతోషంగా సాగాల్సిన ప్రమాణస్వీకారం కన్నీటి మాటున ముగిసింది.  ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మొదలుకుని మిగిలిన వారందరూ కన్నీటితోనే తమ ప్రమాణ పత్రాన్ని చదివారు. పన్నీర్‌సెల్వం, మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి తదితరులు వెక్కివెక్కి ఏడుస్తూనే ముగించారు. కార్యక్రమానికి కొద్ది సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యూరు. ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్దిసేపటికే జయ ఆశీర్వాదం పొందేందుకు సీఎం పన్నీర్‌సెల్వం, కొద్దిమంది తన మంత్రివర్గ సహచరులతో విమానంలో బెంగళూరుకు వెళ్లారు.
 
  కొత్త క్యాబినెట్‌లో మంత్రులు వీరే
 పన్నీర్ సెల్వం క్యాబినెట్‌లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 30 మంది జయ పాలనలోని శాఖల్లోనే కొనసాగుతున్నారు. నత్తం విశ్వనాథన్ , వైద్యలింగం, ఎడప్పాడి కె.పళణిస్వామి, పి.మోహన్, బి.వలర్మతి, పి.పళణియప్పన్, కె.రాజు, ఆర్.కామరాజ్, పి.తంగమణి, వి.సెంథిల్ బాలాజీ, ఎం.సి.సంపత్, ఎస్.ఎస్.కృష్ణమూర్తి, ఎస్.పి.వేలుమణి, టి.కె.ఎన్.చిన్నయ్య, ఎస్.గోకుల ఇందిరా, ఎస్.సుందర్‌రాజ్, పి.సెందూర్ పాండియన్, ఎస్.పి.షణ్ముగనాధన్, ఎన్.సుబ్రహ్మణియన్, కె.ఎ.జయపాల్, ఎన్.సుబ్రహ్మణియన్, ఆర్.బి.ఉదయకుమార్, కె.టి.రాజేంద్ర బాలాజీ, బి.వి.రమణ, కె.సి.వీరమణి, ఎం.ఎస్.ఎం ఆనందన్, తోప్పు, టి.పి.పొన్నాచ్చి, ఎస్.అబ్దుల్ రహీం, సి.విజయభాస్కర్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.
 
 ఆత్మహత్యలు, ఆందోళనలు
 అమ్మ జైలుకెళ్లినా కొద్దిరోజుల్లోనే తిరిగొస్తారు, ప్రజలందరినీ ఆశీర్వదిస్తారు, గతంలో చూశాం కదా. అమ్మ తనపై సాగిన కుట్రలన్నింటినీ ఛేదించుకుని మళ్లీ సీఎం పీఠంపై కూర్చుంటారురూ.రూ..  ఇదీ తమిళనాడులో అమ్మను ఆరాధించే ప్రజల నమ్మకం. అన్నాడీఎంకే శ్రేణుల విశ్వాసం. మనసుకు సమాధానం చెప్పుకుని గుండెను దిటవు చేసుకోలేక ఈ మూడురోజుల్లో సుమారు 20 మంది ప్రాణాలు వదిలారు. కొందరు ఒంటికి నిప్పు అంటించుకోగా, మరికొందరు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇళ్లలో కూర్చుని టీవీలు చూస్తూ మరి కొందరు గుండెపోటుకు గురై మృతి చెందినట్లు సమాచారం. కన్యాకుమారి జిల్లాలో గణపతి (44) అనే అన్నాడీఎంకే కార్యకర్త తన ఇంటికి సమీపంలో రోడ్డుపై ఇనుపకమ్ములతో జైలు వంటి గదిని నిర్మించుకుని ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించాడు. జయ జైలు నుంచి విడుదలయ్యే వరకు తాగునీరు మినహా ఆహారం ముట్టనని ప్రకటించాడు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement