ఆ ఎమ్మెల్యేలకు రాజభోగం
►క్యాంప్ ఎమ్మెల్యేలకు‘మాయాబజార్’ ఆతిథ్యం
►దినకరన్‌కు మరో తొమ్మిదిమంది ఎమ్మెల్యేల మద్దతు?
చెన్నై: పుదుచ్చేరిలో బసచేసి ఉన్న టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు రాజభోగాలను అనుభవిస్తున్నట్లు సమాచారం. సదరు రిసార్టులో 50 లగ్జరీ రూములు ఉండగా అన్నింటినీ దినకరన్ బుక్ చేశారు. సువిశాలమైన గార్డెన్, భారీ స్విమ్మింగ్ పూల్, బాడీ మసాజ్ చేసే స్పా, రిసార్టు వెనుకనే ఆహ్లాదకరమైన బీచ్‌లో ఎమ్మెల్యేలు సేద తీరుతున్నారు. అంతేగాక మాయాబజార్ సినిమాలో గొంతెమ్మ కోర్కెల్లా ఎమ్మెల్యేలకు సరఫరా అవుతున్నాయి. విదేశీ చేపలు, ఇతర సీ ఫుడ్స్‌ను వండి వారుస్తున్నారు. ఖరీదైన విదేశీ మద్యం కారుచౌక ధరకు పుదుచ్చేరి పెట్టింది పేరు.
అందుకోసమే అన్నట్లుగా మినీ వ్యాన్ నిండా కూల్‌డ్రింక్స్ బాటిళ్లు సరఫరా అవుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు బుధవారం ఉదయాన్నే లేచి సముద్ర తీరంలో జాగింగ్ చేశారు. మహాబలిపురం సమీపం కూవత్తూరులో శశికళ నిర్వహించిన రిసార్టు వలే ఇక్కడ కూడా మూడువైపులా నీరు ఉన్నందున ఇతరులకు ప్రవేశం లేకుండా శత్రు దుర్భేద్యంగా ఉంటుందని దినకరన్ ఎంచుకున్నారు.
అయితే తమిళనాడుకు అందుబాటులో ఉన్నందున అంత సేఫ్టీ లేదని భావిస్తున్న దినకరన్ ఈ ఎమ్మెల్యేల క్యాంప్‌ను బెంగళూరుకు మార్చనున్నట్టు సమాచారం. తాజాగా దినకరన్‌కు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మద్దతు పలకనున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఉన్న 19మంది ఎమ్మెల్యేలతో పాటు తొమ్మిదిమంది చేరితే, దినకరన్‌కు 28మంది ఎమ్మెల్యేల మద్దతు లభించినట్లే.