నవనీతకృష్ణన్ నామినేషన్
చెన్నై, సాక్షి ప్రతినిధి: వచ్చేనెల 3 వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఏ నవనీత కృష్ణన్ సోమవారం తన నామినేషన్‌ను దాఖలు చేశా రు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటరాగా చెన్నైలోని సచివాలయంలో మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల అధికారి జమాలుద్దీన్‌కు నవనీత కృష్ణన్ తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. సీఎం జయలలితతోపాటు పదిమంది ఎమ్మెల్యేలు ఆయన నామినేషన్‌ను ప్రతిపాదించారు. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్‌పీఎస్‌సీ) చైర్మన్‌గా ఉన్న నవనీతకృష్ణన్ అన్నాడీఎంకే తరపున రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దిగారు. డీఎంకే రాజ్యసభ సభ్యుడు సెల్వగణపతి అవినీతి ఆరోపణలు, శిక్ష కారణంగా రాజీనామా చేసి వైదొలగాల్సి వచ్చింది.
దీంతో తమిళనాడులో ఒక ఖాళీ ఏర్పడింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, 118 ఓట్లు దక్కించుకున్నవారే రాజ్యసభకు ఎంపికవుతారు. అన్నాడీఎంకేకు 153 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడుగురు డీఎండీకే రెబల్ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకు అండగా నిలుస్తున్నారు. అసెంబ్లీలో అన్ని పార్టీల బలాబలాలను పరిశీలిస్తే సంఖ్యాబలం ప్రకారం అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు ఖాయమని తెలుస్తోంది. రాజ్యసభకు రాజీనామా చేసిన సెల్వగణపతికి 2016 జూన్ 29 వ తేదీ వరకు గడువు ఉన్నందున అప్పటి వరకు నవనీతకృష్ణన్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతారు. రాజ్యసభ ఎన్నికల కోసం ఈనెల 16 నుంచి 23 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24వ తేదీన పరిశీలన, 26వ తేదీన ఉపసంహరణ పూర్తిచేసి జూలై 3న పోలింగ్ నిర్వహిస్తారు.
అదే రోజు సాయంత్రం లెక్కింపు నిర్వహించి విజేత పేరును ప్రకటిస్తారు. ఎన్నికల రాజుగా పేరొందిన పద్మరాజన్ ఎప్పటి వలెనే తన నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన నామినేషన్ల సంఖ్య 161కి చేరుకుంది. అలాగే పీఎన్ రామచంద్రన్ అనే వ్యక్తి సైతం వరుసగా 15వ నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరి నామినేషన్లను ఎమ్మెల్యేలు ఎవరూ ప్రతిపాదించని కారణంగా చెల్లనివిగా మిగిలిపోయి నవనీత్‌కృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అన్నాడీఎంకే న్యాయసలహాదారుగా ఉన్న మనోజ్‌పాండియన్‌ను తప్పించి, ఆ పదవికి నవనీత కృష్ణన్‌ను నియమిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, సీఎం జయలలిత సోమవారం ప్రకటించారు.