ఆ ఇద్దరికి ఒక్కరే దిక్కు
జయ, కరుణల నామినేషన్‌కు అతనే కీలకం
సీఎం అభ్యర్థులకు సిసలైన ఏజెంట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటుంది. అవునంటే కాదు, ఆలి అంటే మొగుడు అని వాదించుకునే తత్వం. ఒకరి ప్రభుత్వంలో చేసిన పని మంచిదైనా మలి ప్రభుత్వం రాగానే దాన్ని కాలరాయాల్సిందే’. అయితే ఆశ్చర్యకరంగా వారిద్దరిని సీఎం పీఠం ఎక్కించే అవసరాలకు సహాయపడేది మాత్రం ఒక్కరే కావడం విశేషం. తమిళనాడు రాజకీయాల గురించి తెలిసిన వారు ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏమా కథ అనేంతగా జుట్టుపీక్కోరు. ఆ ఇద్దరు డీఎంకే అధినేత కరుణానిధి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. వారిద్దరికీ ఒకే దిక్కుగా నిలిచిన చిరు జీవి స్టాంప్ పేపర్ల ఏజెంటు. ఇంతకూ విషయం ఏమిటంటే...
ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నామినేషన్ల విషయంలో కొన్ని పోలికలు చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరు వ్యక్తులు ఈనెల 25వ తేదీనే నామినేషన్ వేశారు. అలాగే ఇద్దరు గత ఎన్నికల్లో ఏ నియోజకవర్గం (ఆర్కేనగర్, తిరువారూరు) నుంచి గెలుపొందారో అదే నియోజకవర్గం నుండి సిట్టింగ్ అభ్యర్థులుగా పోటీకి దిగుతున్నారు. ఇలాంటి పోలికలతో తాజా ఎన్నికలు జరుగుతుండగా మరో విచిత్రమైన పోలిక కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే అభ్యర్థులు అనేక ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి తన ఆస్తి తదితర వివరాలను స్టాంప్ పేపర్లపై మాత్రమే పొందుపరిచి నామినేషన్ పత్రంతో జత చేయాలి.
మైలాపూరు పీబీవీ కోయిల్ వీధికి చెందిన రూప్‌బాషా (68) అనే ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టాంప్ వెండర్ ఉన్నాడు. ఈ వ్యక్తి వద్దనే ఈనెల 23వ తేదీన జయలలిత కోసం స్టాంప్‌పేపర్లు కొనుగోలు చేశారు. అలాగే కరుణానిధి కోసం డీఎంకే నేతలు గత నెల 23వ తేదీన స్టాంప్ పేపర్ల కొన్నారు. ఈ సందర్బంగా రూప్‌బాషా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం అన్నాడీఎంకే నేతలు వచ్చి ముఖ్యమంత్రి నామినేషన్‌కు అవసరమైన స్టాంప్ పేపర్లు కావాలని కోర డంతో ఆనందంతో అప్పగించాను అన్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జయలలితకే తానే స్టాంప్ పేపర్లు ఇచ్చానని తెలిపారు. అంతేగాక కరుణానిధికి సైతం తానే స్టాంప్ పేపర్లు సిద్ధం చేశానని కొందరు చెప్పారు.
అయితే కరుణానిధి పేరుతో చెన్నైలో ఎంతో మంది ఉన్నందున పోల్చుకోలేక పోయా ను. స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు, బడా రాజకీయ నాయకులు తన వద్దకు వస్తుంటారు, వారిని ఎక్కువ ప్రశ్నలు వేయకూడదని చెప్పాడు. అం దుకే మీడియా వారు చెప్పేవరకు జయలలిత, కరుణానిధిలకు తానే స్టాంప్ పే పర్లు అమ్మానని తెలియదని అతను ఆనం దం వ్యక్తం చేశాడు. జయలలిత నివసించే పోయెస్‌గార్డెన్, కరుణానిధి నివాస గృహం ఉన్న గోపాలపురం రెండునూ మైలాపూరు డివిజన్ నోటరీ కిందకే వస్తుంది. ఈ కారణం వల్ల జయ, కరుణ ఇద్దరూ తప్పని సరిగా అదే స్టాంప్ పేపర్ల ఏజెంటు వద్ద కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇదండీ అసలు సంగతి.