నాయకులకు ఉద్వాసన, తేనిలో అన్నాడీఎంకే ప్రక్షాళన | AIADMK President Jayalalitha given shock to Tamil Selvan | Sakshi
Sakshi News home page

నాయకులకు ఉద్వాసన, తేనిలో అన్నాడీఎంకే ప్రక్షాళన

Published Thu, Oct 10 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

AIADMK President Jayalalitha given shock to Tamil Selvan

సాక్షి, చెన్నై: తేని జిల్లా అన్నాడీఎంకేలో బయలుదేరిన గ్రూపు రాజకీయాలపై ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత్రి జయలలిత కన్నెర్రజేశారు. ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంకు వ్యతిరేకంగా తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించిన ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్‌కు షాక్ ఇచ్చారు. ఆయన మద్దతుదారులకు ఉద్వాసన పలికారు. ముఖ్యమంత్రి జయలలిత నమ్మిన బంటుల్లో ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం ప్రథముడు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జయలలిత తర్వాతి స్థానంలో పన్నీరు సెల్వం ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా తేనిలో తిరుగుబాటు ధోరణి బయలుదేరడం జయలలితకు ఆగ్రహాన్ని తెప్పించింది. మరో ఛాన్స్ ఇవ్వకుండా తిరుగుబాటుదారులపై కొరడా ఝుళిపించారు. తన కోసం గతంలో ఎమ్మెల్యే పదవిని, సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేసిన తంగతమిళ్ సెల్వన్ వర్గానికి షాక్ ఇస్తూ జయలలిత నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
 
 తేని వివాదం: ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం తేని జిల్లాకు చెందిన వారు. ఇక్కడ మరో నేత తంగతమిళ్ సెల్వన్ కూడా ఉన్నారు. ఈయన జయలలిత నెచ్చెలి శశికళ మద్దతుదారుడు. జయలలిత కోసం తన సిట్టింగ్ స్థానాన్ని వదులుకున్నారు. అందుకు ప్రతిఫలంగా గతంలో రాజ్యసభ సీటు తమిళ్ సెల్వన్‌ను వరించింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తమిళ్ సెల్వన్ జిల్లాలో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు పన్నీరు సెల్వం చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తేనిలో జరిగిన పార్టీ సమావేశం వివాదాన్ని రెట్టింపు చేసింది.
 
 పోస్టర్లు: పన్నీరు సెల్వం తమ నేతకు చెక్ పెడుతుండడం తంగతమిళ్ సెల్వన్ మద్దతుదారులకు మింగుడు పడలేదు. దీంతో ఆ సమావేశంలో తమిళ్ సెల్వన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. పన్నీరు సెల్వంకు వ్యతిరేకంగా జిల్లాలో పోస్టర్లు వెలిశాయి. త్యాగం చేసిన వాళ్లను కాదని, ఎవరెవరికో పట్టం కడతారా అంటూ ఏకంగా జయలలితను ప్రశ్నిం చే రీతిలో ఈ పోస్టర్లు ఉండడం చర్చకు దారి తీసింది. చివరకు ఈ వ్యవహారం జయలలిత దృష్టికి చేరడంతో ఆమె కన్నెర్రజేశారు. పన్నీరు సెల్వంకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడంతో పాటు, ఆ జిల్లాలో గ్రూపు రాజకీయాలు బయలుదేరుతున్న సమాచారంతో కొరడా ఝుళిపించే పనిలో పడ్డారు.
 
 ఉద్వాసన : ఆ జిల్లాలో ఇతర నేతలకు గుణపాఠం చెప్పే విధంగా తంగతమిళ్ సెల్వన్‌కు షాక్ ఇస్తూ బుధవారం జయలలిత నిర్ణయం తీసుకున్నారు. పార్టీ, అనుబంధ విభాగాల్లో ఉన్న ఆయన మద్దతుదారులు పాల్‌పాండి, సెల్వన్, రాజశేఖర్, టి.నరసింహన్, రాజన్, శక్తివేల్, పుదురు రాజ తదితరులకు ఉద్వాసన పలికారు. పార్టీ సభ్యత్వం సైతం రద్దు చేశామని, ఇక మీదట జిల్లా స్థాయిలోని నాయకులు, కార్యకర్తలు వారికి ఎలాంటి సహకారం అందించొద్దని పేర్కొన్నారు.
 
 ప్రక్షాళన: తిరునల్వేలి జిల్లా పార్టీలో ప్రక్షాళన చేయూలని నిర్ణయించారు. ఇది వరకు తిరునల్వేలి జిల్లాగా ఉన్న పార్టీ కార్యవర్గాన్ని ప్రస్తుతం రెండుగా చీల్చుతూ మార్పులు చేశారు. తిరునల్వేలి అర్బన్ పార్టీ, తిరునల్వేలి సబర్బన్ పార్టీగా ప్రకటించారు. అర్బన్ పరిధిలోకి తిరునల్వేలి, పాళయం కోట్టై, శంకరన్ కోవిల్, వాసుదేవ నల్లూరు, కడయనల్లూరు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధుల్లోని ప్రాంతాల్ని చేర్చారు. సబర్బన్ పరిధిలోకి అంబాసముద్రం, ఆలంగుళం, తేన్‌కాశి, నాంగునేరి, రాధాపురం నియోజకవర్గాల పరిధుల్లోని ప్రాంతాల్ని చేర్చారు. తిరునల్వేలి అర్బన్ పార్టీ కార్యదర్శిగా ఎస్.ముత్తు కరుప్పన్, సబర్బన్ పార్టీ కార్యదర్శిగా ఆర్.మురుగయ్య పాండియన్‌ను నియమించారు. ఇతర కార్యవర్గాన్ని త్వరలో ప్రకటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement