మేయర్ రాజీనామా | AIADMK sacks Coimbatore mayor for low victory margin | Sakshi
Sakshi News home page

మేయర్ రాజీనామా

Published Wed, May 28 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

AIADMK sacks Coimbatore mayor for low victory margin

 సాక్షి, చెన్నై: కోయంబత్తూరు కార్పొరేషన్ మేయర్ సేమా వేలు స్వామి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కోయంబత్తూ రు అన్నాడీఎంకే వర్గాల్లో చర్చ బయలు దేరింది. ఆయన మద్దతుదారులు  రాజీనామ ఉపసంహరణకు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే, సీఎం, పార్టీ అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అత్యధిక సీట్లను కైవశం చేసుకున్నా, ఆ పార్టీ నాయకులకు ఉద్వాసనలు తప్పడం లేదు. పార్టీ అభ్యర్థుల మెజారిటీ తగ్గే రీతిలో అనేక చోట్ల నేతలు నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించినట్టు వచ్చిన ఫిర్యాదులతో ఆయా ప్రాంతాల్లోని నాయకుల భరతం పట్టే పనిలో అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత పడ్డారు.
 
 గత వారం పలువురు మంత్రుల్ని పదవుల నుంచి తప్పించారు. ఆయా జిల్లాల కార్యదర్శులకు ఉద్వాసన పలుకుతూ వస్తున్నారు. ఈ సమయంలో కోయంబత్తూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా సేమా వేలు స్వామిని ఆ పదవి నుంచి తప్పిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. తనను జిల్లా కార్యదర్శి పదవి నుంచి తప్పించడంతో మేయర్ పదవికి రాజీనామా చేస్తూ సేమా వేలు స్వామి నిర్ణయించారు. అదే రోజు రాత్రి కార్పొరేషన్ కమిషనర్ జి లత ఇంటికి వెళ్లి మరీ తన రాజీనామాను సమర్పించారు. అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. తమ నేత రాజీనామా సమాచారంతో వేలు స్వామి మద్దతుదారులు ఆయన ఇంటి వద్దకు ఉరకలు తీశారు.
 
 అయితే, ఆయన ఎక్కడున్నారో అన్న వివరాలు తెలియక తికమక పడాల్సి వచ్చింది. రాజీనామా ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. డెప్యూటీకి తాత్కాలిక బాధ్యత : మేయర్ రాజీనామాతో ఆ బాధ్యతలను డెప్యూటీ మేయర్ లీలావతి ఉన్నికి అప్పగించారు. తన ఇంటికి వచ్చిన సేమా వేలు స్వామి రాజీనామా లేఖను సమర్పించారని, కారణాలు తనకు చెప్పలేదని కమిషనర్ లత పేర్కొన్నారు. కొత్త మేయర్ ఎంపికకు కొద్ది రోజులు సమయం పట్టనున్నదని వివరించారు. నాలుగు రోజుల్లో కార్పొరేషన్ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయనున్నామని, ఆ సమావేశంలో రాజీనామా ఆమోదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్టు పేర్కొన్నారు. లీలావతి ఉన్ని పేర్కొంటూ, రాజీనామా కారణాలు తెలియవని, అయితే, ఆయన నిర్ణయానికి ఆమోదం తెలుపుతున్నామన్నారు.
 
 జయలిత ఆదేశాల మేరకే...: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకాతో మేయర్ పదవి చేజిక్కించుకున్న సేమా వేలుస్వామి కోయంబత్తూరు మహానగరాన్ని అభివృద్ధి పరచడంలో తన వంతు కృషి చేశారు. ఆయనపై గతంలో పలు రకాల ఆరోపణలు వచ్చారుు. వీటన్నింటినీ పెద్దగా జయలలిత పట్టించుకోలేదని చెప్పవచ్చు. అయితే, లోక్ సభ ఎన్నికల్లో వేలు స్వామి సొంత నియోజకవర్గం సూళూరులో పార్టీ అభ్యర్థికి గణనీయంగా ఓట్లు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించారు. బీజేపీ అభ్యర్థి సీబీ రాధాకృష్ణన్‌కు మద్దతుగా ఆయన తన నియోజకవర్గం పరిధిలో పనిచేసినట్టుగా పార్టీ వర్గాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటిని సమగ్రంగా పరిశీలించి పార్టీ జిల్లా కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. అనంతరం ఆయన చేతిలో ఉన్న మేయర్ పదవిని లాగేయడం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్టు అన్నాడీఎంకేలో చర్చ సాగుతోంది. పార్టీ పదవి ఊడటంతో, మేయర్ పదవికి రాజీనామా చేయాలంటూ జయలలిత ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన తప్పుకున్నట్టుందని పేర్కొంటుండటం గమనార్హం. మేయర్ రాజీనామాతో కొత్త మేయర్ ఎవరన్నది మరి కొద్ది రోజుల్లో సీఎం జయలలిత ప్రకటించనుండడంతో అవకాశం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠతో కార్పొరేటర్లు ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement